• Telugu News
  • /Lifestyle

IRCTC Tourism | కన్యాకుమారి నుంచి రామేశ్వరం వరకు.. రూ.11వేలలో ఆధ్యాత్మిక యాత్ర!

IRCTC Tourism | ఈ సమ్మర్‌లో దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను ఒకేసారి దర్శించుకోవాలని అనుకుంటున్నారా? మీకోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది.

Reported by: Chandram | జీవనశైలి | May 13, 2026, 8:50 pm IST
Read Time: 6 mins
IRCTC Tourism | కన్యాకుమారి నుంచి రామేశ్వరం వరకు.. రూ.11వేలలో ఆధ్యాత్మిక యాత్ర!

IRCTC Tourism | ఈ సమ్మర్‌లో దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను ఒకేసారి దర్శించుకోవాలని అనుకుంటున్నారా? మీకోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. చెన్నై, కన్యాకుమారి, తిరుచెందూర్, రామేశ్వరం, మధురై వంటి ప్రాంతాలను తిరిగి వచ్చేలా ఒక ట్రిప్‌ను ప్లాన్ చేసింది. చెన్నై తాంబరం నుంచి ప్రతి గురువారం ప్రారంభమయ్యే ఈ యాత్ర మొత్తం నాలుగు రాత్రులు, ఐదు రోజుల పాటు సాగనుంది.

ఈ ప్రత్యేక ప్యాకేజీలో కేవలం ఆధ్యాత్మికత మాత్రమే ఉండదు. ప్రకృతి అందాలు చూస్తూ ఆస్వాదించే అవకాశం కూడా ఉంటుంది. రామేశ్వర ఆలయం, మధురై మీనాక్షి ఆలయంతో పాటు కన్యాకుమారిలోని త్రివేణి సంగమం వద్ద సమయాన్ని గడవచ్చు.

ప్యాకేజీ వివరాలు

చెన్నై నుంచి ప్రారంభమయ్యే టూర్ కోసం ఐఆర్‌సీటీసీ కంఫర్ట్ (3టైర్ ఏసీ), స్టాండర్డ్ (స్లీపర్ క్లాస్) విభాగాలుగా చార్జ్ చేస్తున్నారు.

కంఫర్ట్‌లో విభాగంలో అయితే ట్విన్ షేరింగ్‌కు అయితే రూ.15,420; ట్రిపుల్ షేరింగ్‌కు అయితే రూ.12,100 ఐఆర్‌సీటీసీ చార్జ్ చేస్తుంది. ఇక 5 నుంచి 11 సంవత్సరాల లోపు పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.7,000; బెడ్ లేకుండా అయితే రూ.6,280 చార్జ్ చేస్తుంది.

స్టాండర్డ్ విభాగంలో అయితే ట్విన్ షేరింగ్‌కు రూ.13,750 ఐఆర్‌సీటీసీ వసూలు చేస్తుంది. ట్రిపుల్ షేరింగ్‌కు అయితే రూ.10,400 చార్జ్ చేస్తుంది. ఇక 5 నుంచి 11 సంవత్సరాల లోపు పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.5,300 బెడ్ లేకుండా అయితే రూ.4,600 చార్జ్ చేస్తుంది. అదే ఈ పర్యటనకు నలుగురు కంటే ఎక్కువ బృందం వస్తే ఈ ధరలో తగ్గింపు ఉంటుంది.

రోజు వారీ టూర్ ప్లాన్

మొదటి రోజు: రాత్రి 8.17 గంటలకు చెన్నై తాంబరం నుంచి అనంతపురి స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరి వెళ్లాల్సి ఉంటుంది.

రెండో రోజు: ఓవర్‌నైట్ జర్నీ అనంతరం ఉదయం 7.25 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌కు చేరుకుంటారు. కన్యాకుమారిలోని హోటల్‌లో చెక్‌ఇన్ అయిన తర్వాత ఫ్రెషప్ అవ్వడానికి సమయమిస్తారు. ఉదయం 11 గంటలకు హోటల్ నుంచి బయల్దేరి కుమారి అమ్మన్ ఆలయం, త్రివేణి సంగమం, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లూరు విగ్రహం, మహాత్మాగాంధీ మెమోరియల్ మండపం సందర్శించారు. సాయంత్రం త్రివేణి సంగమం వద్ద అద్భుతమైన సూర్యాస్తమయం వీక్షించవచ్చు. రాత్రికి కన్యాకుమారిలోనే బస ఉంటుంది.

మూడో రోజు: తెల్లవారుజామునే లేస్తే సముద్రతీరాన అందమైన సూర్యోదయాన్ని వీక్షించవచ్చు. ఆ తర్వాత హోటల్ చెక్‌అవుట్ చేసి ఉదయం 8.30 గంటలకు రోడ్డుమార్గంలో రామేశ్వరం బయల్దేరతారు. మార్గమధ్యలో తిరుచెందూరు మురుగన్ ఆలయం దర్శించుకుంటారు. సాయంత్రానికి రామేశ్వరం చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. రాత్రికి అక్కడే హోటల్‌లో బస ఉంటుంది.

నాలుగో రోజు: ఉదయం 5 గంటలకు రామేశ్వరం రామనాథస్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం రామర్‌పాదం, పంచముఖ హనుమాన్ దేవాలయం సందర్శిస్తారు. ఆ తర్వాత మధురై బయల్దేరి వెళ్తారు. అక్కడ తిరుప్పరంకుంద్రం మురుగన్ ఆలయం, తిరుమల నాయకర్ మహల్, మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం దర్శించుకుంటారు. సాయంత్రం ఆరు గంటలకు మధురై రైల్వే స్టేషన్‌ నుంచి బయల్దేరతారు.

ఐదో రోజు: ఉదయం 4.50 గంటలకు చెన్నైలోని తాంబరం రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.

ప్యాకేజీలో ఉండే సదుపాయాలు

* ట్రైన్ టికెట్లు
* ఏసీ హోటల్ వసతి
* లోకల ట్రాన్స్‌పోర్టుకు ఏసీ వాహనం
* సైట్ సీయింగ్
* ట్రావెల్ ఇన్సూరెన్స్
* టోల్, పార్కింగ్, జీఎస్టీ

ప్యాకేజీలో లేని సదుపాయాలు

* భోజనం
* ఎంట్రీ టికెట్లు
* టూర్ గైడ్
* వ్యక్తిగత ఖర్చులు