30 బిలియన్ డాలర్ల కంపెనీ.. 30 మంది స్టాఫ్.. వీర్య దానంతో 100 మందికి జన్మనిచ్చిన దాని ఓనర్
ప్రతి మనిషికి కొన్ని కలలు, కోరికలు ఉంటాయి. అదే విధంగా పావెల్ దురోవ్‌కు కూడా ఎక్కువ మంది పిల్లలను కనాలనే కోరిక ఉన్నట్లు ఉంది. దాన్ని కూడా నెరవేర్చుకున్నాడు. ఆయనకు వంద మంది వరకు బయోలాజికల్ పిల్లలు ఉన్నారు. వారి పుట్టుకకు

అది ముప్పై బిలియన్ డాలర్ల కంపెనీ. ప్రపంచ దేశాల్లో కొన్ని కోట్ల మంది దాన్ని ఉపయోగిస్తున్నారు. కాని ఆ కంపెనీలో పనిచేసేది మాత్రం కేవలం ముప్పై మంది మాత్రమే. వినడానికి ఆశ్చర్యంగాను, విచిత్రంగానూ ఉండవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఏం సాధించవచ్చో ఈ సంస్థ చేసి చూపించింది. బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యం నిర్మించి నిరూపించింది. ఇది అక్షరాలా నిజం.
దుబాయ్ కేంద్రంగా టెలిగ్రామ్ మెస్సేంజర్ యాప్ తన కార్యకలాపాలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నది. ఈ సంస్థలో హెచ్ఆర్ విభాగం లేదు కానీ 30 మంది నిపుణులైన ప్రపంచ ప్రఖ్యాత ఇంజినీర్లు పని చేస్తున్నారు. వీరు కూడా దుబాయ్ లోని సెంట్రల్ ఆఫీసుకు అనుబంధంగా వివిధ దేశాల నుంచి రిమోట్‌లో పనిచేస్తున్నారు. వినియోగదారులకు సేవలందించేందుకు ఆటోమేషన్, బాట్స్, అత్యాధునిక మౌలిక సదుపాయాలు కలిగి ఉన్నారు. టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ యాక్టింగ్ ప్రొడక్ట్ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది మొత్తం క్లౌడ్ బేస్డ్ విధానంతో ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తున్నది. ప్రస్తుతం ప్రపంచంలో వాట్సప్ కు 2,780 మిలియన్ల వినియోగదారులు ఉండగా, వీ చాట్ కు 1,380 మిలియన్లు ఉన్నారు. టెలిగ్రామ్ కు మాత్రం 950 మిలియన్ల వినియోగదారులు ఉండడం విశేషం. ఇంత భారీ సంఖ్యలో ఉన్న వినియోగదారులకు 30 మంది మాత్రమే సేవలందిస్తున్నారంటే పూర్తిగా ఆటోమేషన్ పై ఆధారపడి పనిచేస్తున్నదన్న మాట. స్పాన్సర్డ్ మెస్సేజెస్ విక్రయం ద్వారా, ప్రీమియం ఖాతాదారుల ద్వారా భారీగా ఆదాయం పొందుతోంది.
2013 లో ప్రారంభం
టెలిగ్రామ్ యాప్ 2013 లో పావెల్ దురోవ్ ప్రారంభించారు. ప్రతి నెలా యాక్టివ్ యూజర్లు 1 బిలియన్ వరకు పెరుగుతుండగా, 2025 సంవత్సరంలో 1.4 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతుందని అంచనా. 2024లో సంస్థ ప్రాఫిట్ 540 మిలియన్ డాలర్లు. ప్రస్తుత టెలిగ్రామ్ యాప్ విలువ 30 బిలియన్ డాలర్లు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం 2023 లో పావెల్ నెట్ వర్త్ 11.5 బిలియన్ డాలర్లు. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జన్మించిన పావెల్ సెయింట్ పీటర్స్‌బర్గ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఈయన రష్యన్ టెక్నాలజీ వాణిజ్యవేత్త.
తన వీర్య కణాలతో 100 మందికి జననం
ప్రతి మనిషికి కొన్ని కలలు, కోరికలు ఉంటాయి. అదే విధంగా పావెల్ దురోవ్‌కు కూడా ఎక్కువ మంది పిల్లలను కనాలనే కోరిక ఉన్నట్లు ఉంది. దాన్ని కూడా నెరవేర్చుకున్నాడు. ఆయనకు వంద మంది వరకు బయోలాజికల్ పిల్లలు ఉన్నారు. వారి పుట్టుకకు వంద మంది మహిళలలకు తన వీర్యం (స్పెర్మ్) దానం చేసినట్టు ఇటీవల తెలిపారు. 12 దేశాలలోని వంద మంది పిల్లలకు తాను తండ్రిని అయినట్లు వెల్లడించారు. వీర్య దానం గత పదిహేను సంవత్సరాల నుంచి నిరంతరంగా చేస్తున్నానన్నారు. వీరే కాకుండా మగ్గురు భార్యలతో మరో ఆరుగురికి జన్మనిచ్చానని పావెల్ చెప్పారు. వీర్యం దానం చేయడం పౌర బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. మొత్తం 106 మంది సంతానానికి తనకున్న 17.1 బిలియన్ డాలర్లను సమానంగా పంచుతూ వీలునామా కూడా రాసినట్లు ఆయన ఇటీవలే ప్రకటించారు. ఎందుకు దానం చేస్తున్నావని ప్రశ్నించగా, తన స్నేహితుడి సూచన మేరకు అని తెలిపారు. ఆరోగ్యకరమైన వీర్య కణాల లభ్యత తక్కువగా ఉందని ఒక డాక్టర్ తనకు చెప్పడంతో పౌర బాధ్యతగా భావించి వంద మంది మహిళలకు తన వీర్యం దానం చేసినట్లు పావెల్ వివరించారు.