ఎయిమ్స్‌ నుంచి బీజేపీ దిగ్గజ నేత ఎల్‌కే అద్వానీ డిశ్చార్జ్‌

మాజీ ఉప ప్రధాని, బీజేపీ దిగ్గజ నేత ఎల్‌కే అద్వానీ ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ నుంచి గురువారం డిశ్చార్జ్‌ అయ్యారు

 ఎయిమ్స్‌ నుంచి బీజేపీ దిగ్గజ నేత ఎల్‌కే అద్వానీ డిశ్చార్జ్‌

న్యూఢిల్లీ: మాజీ ఉప ప్రధాని, బీజేపీ దిగ్గజ నేత ఎల్‌కే అద్వానీ ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ నుంచి గురువారం డిశ్చార్జ్‌ అయ్యారు. వృధ్యాప్య సమస్యలతో ఆయనను బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో హాస్పిటల్‌లో చేర్పించిన సంగతి తెలిసిందే. 96 ఏళ్ల వయసున్న అద్వానీకి యూరాలజీ, కార్డియాలజీ, గెరియాట్రిక్‌ మెడిసన్‌ తదితర వివిధ రంగాల స్పెషలిస్టు వైద్యులు పూర్తిస్థాయిలో పరీక్షలు జరిపారు. చిన్నపాటి శస్త్రచికిత్సను వైద్యులు అద్వానీకి చేసినట్టు ఒక వార్తా సంస్థ తెలిపింది. ‘వయోసంబంధిత సమస్యలతో అడ్మిట్‌ అయిన అద్వానీ గురువారం డిశ్చార్జ్‌ అయ్యారు’ అని ఎయిమ్స్‌ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అద్వానీ ఆరోగ్యం స్థిరంగానే ఉన్నదని, ఆయనను వైద్యుల పర్యవేక్షించారని ఎయిమ్స్‌ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుత పాకిస్థాన్‌లోని కరాచీలో 1927 నవంబర్‌ 8న జన్మించిన అద్వానీ.. 2024, మార్చి 30న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా భారత రత్న పురస్కారాన్ని అందుకున్నారు. 1942లో స్వయం సేవకుడిగా ఆరెస్సెస్‌లో చేరిన అద్వానీ అక్కడి నుంచి తన రాజకీయ జీవితం మొదలు పెట్టారు. 1970లో రాజ్యసభకు ఎన్నికవడం ద్వారా పార్లమెంటరీ జీవితం మొదలుపెట్టారు. 1989లో తొలిసారి న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసి మోహిని గిరిని ఓడించారు. బీజేపీ అధ్యక్షుడిగా 1986 నుంచి 1990 వరకు, తదుపరి 1993 నుంచి 1998 వరకు, మరోదఫా 2004 నుంచి 2005 వరకూ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 1980లో పార్టీ స్థాపించిన తర్వాత సుదీర్ఘకాలం జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన రికార్డు అద్వానీకే ఉన్నది.