Smoke Paan | పెళ్లి విందులో ‘పాన్’ తిన్న 12 ఏండ్ల బాలిక.. కడుపులో రంధ్రంతో నరకయాతన
Smoke Paan | వివాహ వేడుకకు వెళ్లిన ఓ 12 ఏండ్ల బాలిక ఇష్టంగా పాన్ తిన్నది. కానీ అది ఆమె పట్ల శాపంగా మారింది. ఆ బాలిక కడుపులో ఏకంగా రంధ్రం ఏర్పడింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది.

Smoke Paan | బెంగళూరు : వివాహ వేడుకకు వెళ్లిన ఓ 12 ఏండ్ల బాలిక ఇష్టంగా పాన్ తిన్నది. కానీ అది ఆమె పట్ల శాపంగా మారింది. ఆ బాలిక కడుపులో ఏకంగా రంధ్రం ఏర్పడింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో ఇటీవల జరిగిన ఓ వివాహ విందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ 12 ఏండ్ల బాలిక వెళ్లింది. ఇక విందు భోజనం ఆరగించిన తర్వాత.. అక్కడ అతిథులకు అందిస్తున్న స్మోక్ పాన్‌పై ఆ అమ్మాయి దృష్టి పడింది. అందరూ తింటున్నారుగా అని చెప్పి.. ఆ బాలిక కూడా స్మోక్ పాన్ తీసుకొని తినేసింది.
పాన్ తిన్న తర్వాత ఆమెకు ఏం అనిపించలేదు. కానీ రెండు మూడు రోజులకు ఆమె కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది. దీంతో డాక్టర్లను సంప్రదించగా, ఆమె కడుపులో రంధ్రం ఏర్పడినట్లు నిర్దారించారు. స్మోక్ పాన్ వల్లే ఈ రంధ్రం ఏర్పడిందని పేర్కొన్నారు. చిన్నపేగు వద్ద ఏర్పడిన రంధ్రానికి ఇంట్రా ఆపరేషన్ ఓజీడీ స్కోపీ ద్వారా శస్త్రచికిత్స చేశారు. ఇక బాలిక కోలుకున్న తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యంగా ఉందని, పిల్లలకు స్మోక్ పాన్ మంచిది కాదని వైద్యులు నిర్ధారించారు. స్మోక్ పాన్‌లో నైట్రోజన్ కంటెంట్ అధికంగా ఉండడం వల్లే ఇలా జరిగి ఉంటుందన్నారు వైద్యులు.