ఆశా కిరణ్‌ షెల్టర్‌ హోమ్‌లో 20 రోజుల వ్యవధిలో 13 మంది చిన్నారుల అనుమానాస్పద మృతి!

ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న దివ్యాంగుల షెల్టర్‌హోమ్‌లో 20 రోజుల వ్యవధిలో 13 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ విచారణలో ఈ విషయం వెలుగు చూసింది.

ఆశా కిరణ్‌ షెల్టర్‌ హోమ్‌లో 20 రోజుల వ్యవధిలో 13 మంది చిన్నారుల అనుమానాస్పద మృతి!

నాణ్యతలేని తాగునీరే కారణం?
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ 27 మరణాలు
మరణాలపై బీజేపీ, ఆప్‌ పరస్పర విమర్శలు 

న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న దివ్యాంగుల షెల్టర్‌హోమ్‌లో 20 రోజుల వ్యవధిలో 13 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ విచారణలో ఈ విషయం వెలుగు చూసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఈ మరణాల సంఖ్య 27గా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. రోహిణి ఏరియాలో ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆశాకిరణ్‌ షెల్టర్‌ హోమ్‌లో ఈ మరణాలు చోటు చేసుకున్నాయి. నిర్లక్ష్యం, దుర్బల పరిస్థితులే ఈ మరణాలకు కారణమని బీజేపీ మండిపడింది. మరణాలకు కారణం ఏంటనేది ఇంకా తెలియలేదు. గత ఏడాదికంటే ఈ ఏడాది మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నాయని సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ (ఎస్డీఎం) చెప్పారు. పోస్టుమార్టం నివేదికలు వచ్చిన తర్వాతే మరణాలకు కారణం తెలుస్తుందని అన్నారు. చిన్నారులు అందిస్తున్న తాగునీటి నాణ్యతపై ఎస్డీఎం నివేదిక ప్రశ్నలు లేవనెత్తింది.

ఈ ఘటనకు ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వానిదే బాధ్యతన్న జాతీయ మహిళా కమిషన్‌.. షెల్టర్‌లో పరిస్థితులను పరిశీలించేందుకు నిజ నిర్ధారణ బృందాన్ని పంపింది. ‘ఢిల్లీ ప్రభుత్వం కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ఆశాకిరణ్‌ షెల్టర్‌ హోమ్‌ ‘ఆశలను’ పోగొట్టింది. అందులోనివారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చనిపోతున్నారు. ఢిల్లీ ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి కూర్చున్నది. ఈ ఉదంతాన్ని గుర్తించి, విషయం తెలుసుకునేందుకు మా బృందాన్ని పంపాం’ అని ఎన్సీడబ్ల్యూ రేఖాశర్మ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న నైట్‌ షెల్టర్లపైనా ఎన్సీడబ్ల్యూ ఆడిట్‌ నిర్వహిస్తున్నదని ఆమె తెలిపారు.
ఢిల్లీ మంత్రి అతిశి మాత్రం మరణాల సంఖ్యతో విభేదించారు. ఈ విషయంలో మెజిస్టీరియల్‌ విచారణ చేపట్టి, 48 గంటల్లోగా నివేదిక సమర్పించాలని రెవెన్యూ శాఖ అదనపు చీఫ్‌ సెక్రటరీని ఆదేశించారు. ఆశాకిరణ్‌ షెల్టర్‌ హోమ్‌లో 2024 జనవరి నుంచి 14 మరణాలు చోటు చేసుకున్నాయని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. మరణాలకు కారణమైనవారి నిర్లక్ష్యంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫారసు చేయాలని ఆదేశించారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు ఇవ్వాలని కోరారు.
షెల్టర్‌హోం మరణాలపై బీజేపీ, ఆప్‌ విమర్శలు

ఆశాకిరణ్‌ షెల్టర్‌ హోమ్‌లో పరిస్థితిని అంచనా వేసేందుకు ఢిల్లీ బీజేపీ బృందం అక్కడకు చేరుకున్నది. ‘మాకున్న సమాచారం ప్రకారం.. పిల్లలకు అపరిశుభ్రమైన తాగునీటిని అందిస్తున్నారు. వారికి తగిన ఆహారం, తగిన చికిత్స అందడం లేదు. దీనిపై విచారణకు ఆదేశించాలి. ఇందుకు బాధ్యులైన అధికారులందరిపై చర్యలు తీసుకోవాలి’ అని బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు రేఖా గుప్తా డిమాండ్‌ చేశారు. అయితే.. బీజేపీపై ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్‌ ఎదురుదాడి చేశారు. ‘బీజేపీ నిరసన వ్యక్తం చేస్తున్నది. కానీ.. వారు మయూర్‌ విహార్‌లో మురుగునీటి కాల్వలో పడి చనిపోయిన తల్లీకుమారుల ఇంటిని మాత్రం వారు సందర్శించలేదు. ఆశాకిరణ్‌ షెల్టర్‌ హోమ్‌ ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నందునే అక్కడికి వెళ్లారు’ అని అన్నారు. ఈ విషయంలో సంబంధిత మంత్రి లోతుగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. దోషులెవరైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలుస్తుందని చెప్పారు.