Women Candidates | లోక్‌సభలో తగ్గిన మహిళల ప్రాబల్యం.. కేవలం 30 మంది మాత్రమే ఎన్నిక
లోక్‌సభలో ఏడాదికేడాది మహిళల ప్రాబల్యం తగ్గుతూ వస్తోంది. 2019 ఎన్నికల్లో 78 మంది మహిళలు లోక్‌సభకు ఎన్నిక కాగా, ఇప్పుడు ఆ సంఖ్య మరింత పడిపోయింది

న్యూఢిల్లీ : లోక్‌సభలో ఏడాదికేడాది మహిళల ప్రాబల్యం తగ్గుతూ వస్తోంది. 2019 ఎన్నికల్లో 78 మంది మహిళలు లోక్‌సభకు ఎన్నిక కాగా, ఇప్పుడు ఆ సంఖ్య మరింత పడిపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 30 మంది మాత్రమే గెలిచారు. ఇక ఈ ఎన్నికల్లో మొత్తం 797 మంది మహిళలు పోటీ చేశారు. కానీ 30 మందికి మాత్రమే లోక్‌సభలో అడుగుపెట్టే అదృష్టం వరించింది. 30 మందిలో కుమారి షెల్జా, కంగనా రనౌత్, బన్సూరి స్వరాజ్, హేమ మాలిని, డింపుల్ యాదవ్, మీసా భారతి లాంటి ప్రముఖులు ఉన్నారు.
కుమారి షెల్జా హర్యానాలోని సిర్సా నియోజకవర్గంలో 2.5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మాజీ కేంద్ర మంత్రి, దివంగత నాయకురాలు సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి 78,370 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. హిమాచల్‌లోని మండి నియోజకవర్గం నుంచి నటి కంగనా రనౌత్.. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 74,755 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర నియోజకవర్గం నుంచి హేమమాలిని 5.1 లక్షల ఓట్ల మెజార్టీతో అఖండ విజయం సాధించారు.
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్.. మెయిన్‌పురి నుంచి 2,21,639 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. డింపుల్ చేతిలో బీజేపీ అభ్యర్థి జయవీర్ సింగ్ ఓడిపోయారు. ఆర్జేడీ లీడర్ లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి.. పాటలీపుత్ర నియోజకవర్గంలో కేంద్ర మంత్రి రామ్ కృపాల్ యాదవ్‌పై 85,174 ఓట్ల మెజార్టీతో గెలిచారు. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ అభ్యర్థి మహువా మొయిత్రా 56,705 ఓట్ల మెజార్టీతో కృష్ణాన్‌నగర్ నుంచి గెలుపొందారు. డీఎంకే అభ్యర్థి కనిమొళి తుత్తూకుడి నియోజకవర్గం నుంచి 5,40,729 ఓట్ల మెజార్టీతో అఖండ విజయం సాధించారు.
25 ఏండ్ల వయసున్న వారు నలుగురు ఎన్నిక..
2024 ఎన్నికల్లో 25 ఏండ్ల వయసున్న నలుగురు గెలిచారు. వారు.. పుష్పేంద్ర సరోజ్, ప్రియా సరోజ్.. సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై గెలుపొందగా, శాంభవి చౌదరీ, సంజన జాతవ్.. లోక్‌జనశక్తి, కాంగ్రెస్ పార్టీ టికెట్లపై విజయం నమోదు చేశారు.
శాంభవి చౌదరీ.. బీహార్‌లోని సమస్తిపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సన్నీ హజారీపై గెలుపొందారు. చౌదరి తండ్రి అశోక్ చౌదరి.. నితీశ్ కుమార్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. రాజస్థాన్‌లోని భరత్‌పుర్ నియోజకవర్గం నుంచి సంజనా జాతవ్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రామ్‌స్వరూప్ కోహ్లీపై 51,983 ఓట్ల తేడాతో గెలుపొందారు. పుష్పేంద్ర సరోజ్ అనే వ్యక్తి సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీ చేశారు. కౌషాంబి పార్లమెంటరీ సీటుకు ఆయన పోటీపడ్డారు. బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోన్కర్ పై లక్ష మెజారిటీతో పుష్పేంద్ర విజయం సాధించారు. మచ్చిలిషార్ నియోజకవర్గం నుంచి ప్రియా సరోజ్ సుమారు 35వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. బీజేపీ ఎంపీ బోలానాథ్‌పై ఆమె గెలుపొందారు.