రైడ్ క్యాన్సిల్.. వాట్సాప్‌లో న‌గ్న ఫొటోలు పంపిన క్యాబ్ డ్రైవ‌ర్

రైడ్ క్యాన్సిల్.. వాట్సాప్‌లో న‌గ్న ఫొటోలు పంపిన క్యాబ్ డ్రైవ‌ర్
  • బెంగ‌ళూరు న‌గ‌రంలో షాకింగ్ ఘ‌ట‌న‌
  • నిందితుడి కోసం పోలీసుల గాలింపు


విధాత‌: ఓలా, ఉబ‌ర్‌, ఇత‌ర సంస్థ‌ల ద్వారా మ‌న క్యాబ్ బుక్ చేసుకుంటాం. ఎంతసేపు ఎదురుచూసినా క్యాబ్ రాక‌పోతే రైడ్ క్యాన్సిల్ చేసి ఆటో ఎక్కో లేదా న‌డుచుకుంటూనో గ‌మ్యానికి చేరుకుంటాం. ఇదంతా ఇప్ప‌డు సాధార‌ణ విష‌య‌మే. కానీ, బెంగ‌ళూరులో ఓ క్యాబ్ డ్రైవ‌ర్ దారుణంగా ప్ర‌వ‌ర్తించాడు. రైడ్ క్యాన్సిల్ చేసింద‌నే క‌క్ష‌తో మ‌హిళా వినియోగ‌దారురాలికి న‌గ్న ఫొటోలు పంపాడు. ఆ స‌మ‌యంలో ఫోన్ ఆమె ఆరేండ్ల పాప వ‌ద్ద ఉన్న‌ది. న‌గ్న ఫొటోల‌ను చూసిన బాలిక‌ ఒక్క‌సారిగా షాక్ గురైంది. షాకింగ్ ఘ‌ట‌న‌లో భ‌యాందోళ‌న‌కు గురైన బాధితురాలు క్యాబ్ డ్రైవ‌ర్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.


పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. ఆరేండ్ల‌ బాలిక, తొమ్మిది నెలల చిన్నారికి త‌ల్లి అయిన ఓ మ‌హిళ బెంగళూరులో ఇటీవ‌ల ఒక ఆన్‌లైన్‌ క్యాబ్ సంస్థ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్న‌ది. ఎంత ఎదురుచూసినా స‌కాలంలో క్యాబ్ రాలేదు. దాంతో రైడ్ క్యాన్సిల్ చేసి ఆటోలో ఇంటికి వెళ్లిపోయింది. చివ‌రి క్ష‌ణాల్లో రైడ్ క్యాన్సిల్ చేయ‌డం ఏమిట‌ని.. క్యాబ్ డ్రైవ‌ర్ ఆమె ఫోన్‌చేసి దూషించాడు. అప్ప‌టికే తాను ఐదు కిలోమీట‌ర్లు వ‌చ్చిన‌ట్టు వాగ్వాదానికి దిగాడు.


మీరు స‌కాలంలో రాక‌పోయే స‌రికే రైడ్ క్యాన్సిల్ చేసి ఆటోలో తాను ఇంటికి వ‌చ్చేశాన‌ని, క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పి ఫోన్ క‌ట్ చేసింది. కానీ, క్యాబ్ డ్రైవ‌ర్ మ‌ళ్లీ ఫోన్‌చేసి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. దూషించ‌డం చేశాడు. ఆమె ఫోన్ క‌ట్‌చేసింది. త‌ర్వాత క్యాబ్ డ్రైవ‌ర్‌ న‌గ్న ఫొటోల‌ను వాట్సాప్‌లో మ‌హిళ‌కు సెండ్ చేశాడు. ఆ స‌మ‌యంలో ఫోన్ ఆరేండ్ల చిన్నారి వ‌ద్ద ఉన్న‌ది. వాట్సాప్‌లో ఫొటోలు చూసిన బాలిక షాక్ గురైంది. త‌ల్లి ఆ ఫొటోలు చూసి పొరుగింటి వాళ్ల ద్వారా పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఆన్‌లైన్ సంస్థ ద్వారా క్యాబ్ బుక్ చేస్తే త‌న మొబైల్‌నంబ‌ర్ క్యాబ్ డ్రైవ‌ర్‌కు ఎలా వెళ్లింద‌ని, ఆ సంస్థపై కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌ను కోరింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.