మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇన్ ఫ్లుయెన్సర్ గా మారాలి: దీప్కే హాట్ కామెంట్స్

ప్రధాని నరేంద్ర మోదీ పదవికి రాజీనామా చేసి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే వ్యాఖ్యానించారు. నీట్ నిరసనలు, విద్యార్థులపై చర్యలపైనా ఆయన విమర్శలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ తన పదవికి రాజీనామా చేసి ఇన్ ఫ్లుయెన్సర్ గా మారాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా పనితీరుకంటే ఇన్ ఫ్లుయెన్సర్ గా మోదీ ప్రావీణ్యం బాగుందని..అందుకే ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకుని ఇన్ ఫ్లుయెన్స్ర ర్ గా మారడం మంచిదని దీప్కే సూచించారు.

నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ నెల రోజులకు పైగా కొనసాగిన ఆందోళనల తర్వాత బుధవారం దీప్కే తన స్వస్థలమైన మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు ఈ దేశ భవిత అని, వారు ఉగ్రవాదులు కారు అన్నారు. ఇదేవిధంగా వారిని ఇబ్బందిపెడుతూ ఉంటే ధర్మేంద్ర ప్రధాన్‌లాగే రేపు ప్రభుత్వాన్ని కూడా మార్చేస్తాం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

జంతర్‌ మంతర్‌ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై ప్రభుత్వం వేధింపులను ఆపాలని, నిరసనకారులపై పెల్లెట్‌ తుపాకులు వాడేలా పోలీసులకు అనుమతి ఇచ్చిన వ్యక్తిపై చర్య తీసుకోవాలని అభిజీత్‌ దీప్కే డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం దారికి రాకపోతే యువత ప్రభుత్వాన్నే మారుస్తుందన్నారు. విద్యార్థుల ఆగ్రహం ఇంకా సద్దుమణగలేదు అని, అవసరమైతే ఇంకా పెద్ద ఆందోళనను మళ్లీ ప్రారంభిస్తాం అన్నారు.

ఈ సందర్భంగా దీప్కే తల్లి అనితా దీప్కే మాట్లాడుతూ.. కొడుకు దీప్కే సీజేపీ ప్రారంభించిన కొత్తలో బీజేపీలో చేరకపోతే నీ తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పవు అనే వీడియో బెదిరింపును ఎదుర్కొన్నట్లు గుర్తుచేసుకున్నారు. ఈ కారణంగా తాము ఛత్రపతి సంభాజీనగర్‌ను విడిచిపెట్టి, కొంకణ్‌ ప్రాంతంలోని బంధువుల ఇంట్లో పక్షం రోజులు తల దాచుకున్నట్లు ఆమె వెల్లడించారు.

Latest News