ఈసారి అహ్మదాబాద్‌ స్కూళ్లకు బాంబు బెదిరింపు

ఇటీవలే ఢిల్లీలోని అనేక స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్‌ వచ్చినట్టుగానే.. ఈసారి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. సోమవారం సాయంత్రం ఈ మెయిల్స్‌ అందినట్టు పోలీసులు తెలిపారు

ఈసారి అహ్మదాబాద్‌ స్కూళ్లకు బాంబు బెదిరింపు

అహ్మదాబాద్‌: ఇటీవలే ఢిల్లీలోని అనేక స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్‌ వచ్చినట్టుగానే.. ఈసారి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. ఆదివారం సాయంత్రం ఈ మెయిల్స్‌ అందినట్టు పోలీసులు తెలిపారు. మెయిల్స్‌ అందుకున్న స్కూళ్లల్లో ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ (భోపాల్‌), ఆనంద్‌ నికేతన్‌ (భోపాల్‌), ఆసియా ఇంగ్లిష్‌ స్కూల్‌ (వస్త్రపూర్‌), కలోరెక్స్‌ స్కూల్‌ (ఘట్లోడియా), అమృత విద్యాలయ (ఘట్లోడియా), న్యూనోబెల్‌ స్కూల్‌, ఓఎన్‌జీసీ కేంద్రీయ విద్యాలయ (చంద్రఖేడ) ఉన్నాయి. మెయిల్స్‌ వచ్చిన విషయాన్ని సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు తెలిపాయని అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుతం పాఠశాలలకు వేసవి సెలవులు నడుస్తున్నందున పిల్లల భద్రతకు సంబంధించి కీలక చర్యలు ఏమీ తీసుకోలేదు. అయితే.. సమాచారం తెలియగానే బాంబు తనిఖీ బృందాలు ఆయా పాఠశాలలను సందర్శించి.. తనిఖీలు నిర్వహించాయి. బెదిరింపు మెయిల్స్‌ భారతదేశం వెలుపలి డొమైన్‌తో ఉన్నదని తెలుస్తున్నది. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. భయపడాల్సింది ఏమీ లేదని, అయితే.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అప్రమతతపై హెచ్చరికలు జారీ చేశామని పోలీసులు తెలిపారు. మే ఏడవ తేదీన గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.