Vijay Rupani’s Body Identified: గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ మృతదేహం గుర్తింపు!

న్యూఢిల్లీ : అహ్మదాబాద్ లో ఈ నెల 12న జరిగిన ఏయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపాణీ మృతదేహాన్ని వైద్య బృందం గుర్తించింది. ప్రమాదం జరిగిన మూడు రోజుల అనంతరం ఆయన మృతదేహాన్ని గుర్తించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ వెల్లడించారు. రూపాణీ కుటుంబ సభ్యుల నమూనాలతో మృతదేహం డీఎన్‌ఏ సరిపోలిందన్నారు. దీంతో భౌతికకాయాన్ని వారి కుటుంబసభ్యులకు అప్పగించామని తెలిపారు. అలాగే ఇప్పటిదాకా 32 మంది మృతుల డీఎన్‌ఏ వారి కుటుంబసభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్లు బీజే వైద్య కళాశాల సీనియర్ ప్రభుత్వ వైద్యుడు తెలిపారు.
డీఎన్ఏ పరీక్షల అనంతరం ఇప్పటి వరకు 14 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని వెల్లడించారు. పరీక్షలు అవసరం లేకుండానే బంధువులు గుర్తుపట్టిన 8 మృతదేహాలను సైతం వారి కుటుంబసభ్యులకు అప్పగించామని తెలిపారు. బాధితుల కుటుంబాలతో సమన్వయం చేసుకోవడానికి 230 బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన 11 మంది విదేశీ ప్రయాణికుల కుటుంబాలను ఇప్పటికే సంప్రదించామన్నారు. ప్రమాద తీవ్రత కారణంగా చాలా వరకు మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో డీఎన్‌ఏ టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు. డీఎన్ఏ పరీక్షల ఆలస్యం కారణంగానే మృతదేహాల గుర్తింపు ఆలస్యమవుతుందని వివరించారు.