Ipl 2024 GTVSKKR : గుజరాత్ కొంపముంచిన వరుణుడు
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు, సొంత మైదానంలో వరుణదేవుడు గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ ఆశలపై భారీ వర్షాన్ని చల్లాడు. భారీ వర్షం కారణంగా ఒక్క బాల్ పడకుండానే మ్యాచ్ రద్దయింది.
అహ్మదాబాద్‌లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మొతేరా స్టేడియంను మోతెక్కిచింది. ఐపిఎల్ 2024లో భాగంగా జరగాల్సిన గుజరాత్–కోల్‌కతా (GT vs KKR) మ్యాచ్ దీంతో రద్దయింది. ఒక్క బాల్ కూడా పడకుండా ఎడతెరపి లేని వాన ఆటను గంగలో కలిపేసింది. దీనివల్ల రెండు కీలకమైన విషయాలు కూడా ఆటోమాటిక్‌గా జరిగిపోయాయి. ఒకటి గుజరాత్ టైటాన్స్ ఇంటిముఖం పట్టడం(GT out of Playoffs), రెండోది కోల్‌కతాకు ప్లేఆఫ్స్‌లో మొదటి/రెండో స్థానం (KKR confirmed Top 2 place) నిర్ధారణ జరిగిపోవడం.
వరుణుడు ఇవాళ అహ్మదాబాద్‌లో బీభత్సం సృష్టించాడు. కేవలం గెలుపు మాత్రమే ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచే వేళ, గుజరాత్ టైటాన్స్ ఆశలు తుపాన్లో కొట్టుకుపోయాయి. కనీసం టాస్ కూడా వేయడం వీలు కానంతగా గాలీవానలు స్టేడియంను ఊపేసాయి. బ్యానర్లు చిరిగిపోవడం, ఫ్లడ్ లైట్లు పాడైపోవడం వంటివి కూడా జరిగాయి. నిజానికి గుజరాత్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో భారీ విజయాలు (వారి నెట్ రన్‌రేట్ –1.063) సాధిస్తే తప్ప ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయినట్లే. కానీ, లెక్కల్లో ఆశలుండేవి. ఆ ఆశలు కూడా ఇప్పుడు పోయిన ఒక్క పాయింట్‌తో ఆవిరయ్యాయి. అదే ఒక్క పాయింట్ 18 పాయింట్లతో గొప్ప రన్‌రేట్‌తో ఉన్న కోల్‌కతాకు టాప్2లో బెర్త్ కన్ఫర్మ్ చేసింది.

గుజరాత్ ఐపిఎల్ ప్రస్థానంలో ప్లేఆఫ్స్ ఆడలేకపోవడం ఇదే మొదటిసారి. ఇక మిగిలిన నామమాత్రపు మ్యాచ్‌లో హైదరాబాద్‌తో మే16న తలపడనుంది. ఇక కోల్‌కతా తమ మిగిలిన ఒక్క మ్యాచ్‌లో రాజస్థాన్‌ను ఓడిస్తే, చరిత్రలో మొదటిసారిగా మొదటిస్థానంలో ఉంటుంది. రాజస్థాన్ తమకు ఉన్న రెండు మ్యాచ్‌ల(ఒకటి కోలకతా తోనే)లో ఓడిపోయినా కోల్‌కతా ఫస్టే.
ఈ ఒక్క మ్యాచ్ రద్దవడం నాలుగు జట్ల జాతకాలను తారుమారు చేసింది. మ్యాచ్ ముందు వరకు ఉన్న లెక్కలన్నీ మారిపోయాయి. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, లక్నో ఇప్పుడు సమీకరణాలలో తేడాలను విపులీకరించుకునే పనిలో పడ్డాయి. ఎవరు ఎవరితో ఓడిపోవాలి? ఎవరు ఎవరిపై గెలిస్తే మనకు లాభం? అనే లెక్కలు వారిని భయపెడుతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram