Air India | సమ్మె విరమించిన ఎయిరిండియా సిబ్బంది

వివిధ సమస్యల పరిష్కారాన్ని డిమాండ్‌ చేస్తూ మూకుమ్మడి సిక్‌లీవ్‌ పెట్టిన ఎయిరిండియా క్యాబిన్‌ క్రూ సిబ్బంది తమ సమ్మెను విరమించారు. వారు లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో విధుల్లోకి చేరేందుకు సిద్ధమయ్యారు.

Air India | సమ్మె విరమించిన ఎయిరిండియా సిబ్బంది
  • 25 మందిని విధుల్లోకి తీసుకున్న యాజమాన్యం
  • సమస్యలు పరిష్కరిస్తామని హామీ

న్యూఢిల్లీ : వివిధ సమస్యల పరిష్కారాన్ని డిమాండ్‌ చేస్తూ మూకుమ్మడి సిక్‌లీవ్‌ పెట్టిన ఎయిరిండియా క్యాబిన్‌ క్రూ సిబ్బంది తమ సమ్మెను విరమించారు. వారు లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో విధుల్లోకి చేరేందుకు సిద్ధమయ్యారు. 25 మందికి పంపిన తొలగింపు ఉత్తర్వులను వాపస్‌ తీసుకుంటున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. దీంతో రెండున్నర రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభనకు తెరపడింది. సిబ్బంది ఆకస్మిక సమ్మెతో ఎయిరిండియా తీవ్రంగా ఇబ్బందిపడింది.

ఎయిరిండియా విమానాల్లో టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఏఐఎక్స్‌ కనెక్ట్‌తో (గతంలో ఎయిర్‌ ఏషియా) విలీనంతోపాటు గదుల షేరింగ్‌, తగిన మద్దతు లేకపోవడం, వేతన సవరణ, ఉద్యోగుల మధ్య వివక్ష తదితర అంశాలను ఉద్యోగులు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో గురువారం ఎయిరిండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ యూనియన్‌ మధ్య చర్యలు జరిగాయి. ఉభయపక్షాలూ సహకరించుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయానికి వచ్చారు. దీనితో సమ్మెకు దిగిన సిబ్బంది విధుల్లో చేరేందుకు అంగీకరించారు. వారికి ఇచ్చిన తొలగింపు ఉత్తర్వులను ఎయిరిండియా వాపస్‌ తీసుకున్నది.