DUSU POLLS । ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ సంయుక్త పోటీ
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయనున్నట్టు వామపక్ష విద్యార్థి సంఘాలు ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ సోమవారం ప్రకటించాయి. సెప్టెంబర్ 27న పోలింగ్ జరుగనున్నది.

DUSU POLLS । ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో సంయుక్తంగా పోటీ చేయనున్నట్టు వామపక్ష విద్యార్థి సంఘాలు ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ సోమవారం ప్రకటించాయి. ఢిల్లీ యూనివర్సిటీలో ఆరెస్సెస్/బీజేపీ అనుబంధ ఏబీవీపీని ఓడించేందుకు తాము ఉమ్మడిగా పోటీచేయాలని నిర్ణయించినట్టు సీపీఎం అనుబంధ సంఘమైన ఎస్‌ఎఫ్‌ఐ, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ అనుబంధ ఏఐఎస్‌ఏ నేతలు మీడియా సమావేశంలో చెప్పారు.
ఫీజుల భారం, హాస్టళ్లలో సౌకర్యాల లేమి, విద్య అందుబాటులో లేకపోవడం వంటి విద్యార్థులకు సంబంధించిన అంశాలపై ఉమ్మడి కనీస మ్యానిఫెస్టోను విడుదల చేస్తామని ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ నాయకులు తెలిపారు. బీజేపీ విద్వేష రాజకీయాలు, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి కృషిని ప్రతిబింబిస్తూ ఢిల్లీ యూనివర్సిటీలోనూ అదే నమూనాతో విద్యారంగ, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఏఐఎస్‌ఏ ఢిల్లీ కార్యదర్శి నేహ చెప్పారు. ఈ ఎన్నికల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ధన రాజకీయాలకు, కండబల రాజకీయాలకు వ్యతిరేకంగా ఉమ్మడి ప్యానెల్‌ను, అజెండాను ప్రతిపాదించబోతున్నట్టు చెప్పారు. మీడియా సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ ఢిల్లీ కార్యదర్శి ఐషీ ఘోష్ కూడా పాల్గొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికలు సెప్టెంబర్ 27న నిర్వహించనున్నారు. ఫలితాలను మరుసటి రోజు వెల్లడిస్తారు.
గత ఏడాది ఢిల్లీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఏబీవీపీ మూడు సెంట్రల్ ప్యానెల్ పోస్టులను ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ.. గెలుచుకోగా, ఎన్‌ఎస్‌యూఐ అభ్యర్థి వైస్ ప్రెసిడెంట్‌గా గెలిచారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంగణం చిన్నపాటి నగరంలో ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎటు చూసినా పోస్టర్లు, కరపత్రాలు, గోడ రాతలు కనిపిస్తున్నాయి. జేఎన్‌యూ తరహాలోనే ఇది కూడా భావి రాజకీయ నేతల తయారీ కేంద్రంగా విరాజిల్లుతున్నది. ఇక్కడ విద్యార్థి సంఘ నేతలుగా ఎదిగినవారు తరువాతి రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో, కేంద్రంలో కీలక బాధ్యతల్లోకి వెళ్లారు.
ఈ ఎన్నికల్లో ఆప్ విద్యార్థి విభాగం ఛాత్ర యువ సంఘర్ష్ సమితి (సీవైఎస్‌ఎస్) పోటీ చేయడం లేదు. ఏబీవీపీని ఓడించగలిగే సంఘానికి మద్దతు ఇస్తామని ప్రకటించింది. ఓట్ల చీలికను నివారించేందుకే తాము పోటీ చేయడం లేదని పేర్కొన్నది. విద్యార్థి వ్యతిరేక, జాతి వ్యతిరేక సంఘంగా ఏబీవీపీ వ్యవహరిస్తున్నదని సీవైఎస్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. విద్యార్థులను కులం, మతం ప్రాతిపదిక విడదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.