AK-203 | 800 మీటర్ల రేంజ్ – నిమిషానికి 700 బుల్లెట్లు : భారత్ కా ‘షేర్’

భారత సైన్యంలో INSAS రైఫిల్‌ల స్థానంలో AK-203 ‘షేర్’ రైఫిల్‌లు చేరుతున్నాయి. అమేథీలో స్వదేశీ సాంకేతికతతో తయారవుతున్న AK-203 రైఫిల్ ఒక్క నిమిషానికి 700 బుల్లెట్లు పేల్చగలదు. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి కూడా ఎగుమతుల కోసం ఆసక్తి రాబడుతున్న AK-203 రైఫిల్ ప్రత్యేకతలు తెలుసుకోండి.

AK-203 | 800 మీటర్ల రేంజ్ – నిమిషానికి 700 బుల్లెట్లు : భారత్ కా ‘షేర్’

Adharva / National News / 18 July 2025

• భారత సైన్యానికి స్వదేశీ AK-203 ‘షేర్’ రైఫిల్
• INSAS రైఫిల్స్ కు ఇక గుడ్‌బై
• 2030 నాటికి 6 లక్షల AK-203 రైఫిల్స్
• ఒక్క నిమిషానికి 700 బుల్లెట్లు పేల్చగలదు

భారత సైన్యం ఆధునిక ఆయుధ వ్యవస్థలను సమీకరించుకోవడానికి తీసుకున్న కీలక నిర్ణయాలలో ఒకటి AK-203 ‘షేర్’ రైఫిల్‌ల ఉత్పత్తి. ఈ రైఫిల్‌లు ప్రసిద్ధ కలాష్నికోవ్ సిరీస్‌లోని తాజా రూపకల్పనతో తయారవుతూ, యుద్ధభూముల్లో వేగవంతమైన ప్రతిస్పందనకు, అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ విశ్వసనీయతకు నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తున్నాయి. మూడు దశాబ్దాలుగా వినియోగంలో ఉన్న INSAS రైఫిల్‌లను వీటి ద్వారా భర్తీ చేస్తూ, సైన్యంలో దూకుడైన ఆయుధ సామర్థ్యం పెరుగుతోంది. ఒక్క నిమిషంలో 700 రౌండ్లు పేల్చగల సామర్థ్యం, 800 మీటర్ల దూరం వరకు ఖచ్చితమైన లక్ష్యాన్ని చేరుకోవడం AK-203 ప్రత్యేకతల్లో కొన్ని మాత్రమే.

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఏర్పాటు చేసిన ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (IRRPL) ఈ రైఫిల్ ఉత్పత్తి కేంద్రంగా నిలుస్తోంది. భారత్ మరియు రష్యా సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పడిన ఈ సంస్థలో భారత ప్రభుత్వ అనుబంధ సంస్థలు — అడ్వాన్స్‌డ్ వెపన్స్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ (AWEIL), మ్యూనీషన్స్ ఇండియా లిమిటెడ్ (MIL) 50.5% వాటా కలిగి ఉండగా, రష్యా రోసోబోరోనెక్స్‌పోర్ట్ (RoE), కలాష్నికోవ్ కన్సర్న్ (CK) 49.5% వాటాతో భాగస్వామ్యం చేస్తున్నాయి. ఈ భాగస్వామ్యానికి ప్రధాన ఉద్దేశ్యం భారత్‌లోనే రైఫిల్‌లను స్వదేశీ సాంకేతికతతో తయారు చేసి, దేశ రక్షణ స్వయం ఆధారితంగా ఉండేలా చేయడం. రూ.5,200 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు కింద మొత్తం 6,01,427 రైఫిల్‌లను భారత రక్షణ మంత్రిత్వ శాఖకు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 48,000 రైఫిల్‌లు అందించబడ్డాయి. ఈ ఏడాది ఆగస్టులో 7,000 రైఫిల్‌లు, డిసెంబర్ నాటికి మరిన్ని 15,000 రైఫిల్‌లు సైన్యానికి చేరనున్నాయి. 2026లో అదనంగా 1 లక్ష రైఫిల్‌లను ఉత్పత్తి చేయనున్నారు. IRRPL యొక్క ప్రణాళిక ప్రకారం, మొత్తం ఆర్డర్‌ను 2032 డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉండగా, 22 నెలలు ముందుగానే అంటే 2030 డిసెంబర్‌కే ఉత్పత్తి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు.

స్వదేశీకరణ మరియు ఉత్పత్తి సామర్థ్యం:

AK-203 ‘షేర్’: AK-47 డిజైన్‌పై ఆధారపడిన తాజా తరహా రైఫిల్. 7.62x39mm క్యాలిబర్‌తో ఇది నిమిషానికి 700 రౌండ్లు పేల్చగలదు మరియు 800 మీటర్ల వరకు ఖచ్చితమైన రేంజ్ కలిగివుంటుంది. INSAS కంటే తేలికగా (3.8 కిలోలు) ఉండి, టెలిస్కోపిక్ బట్‌స్టాక్, 30 బుల్లెట్లు మేగజైన్‌లో పెట్టే వీలుతో కూడిన ఈ రైఫిల్‌లకు రికాయిల్ నియంత్రణ మరింత మెరుగ్గా ఉంది. ఆధునిక ఆప్టిక్స్ అమర్చే సౌలభ్యం వంటి ఆధునిక సదుపాయాలు కలిగి ఉంది. ప్రస్తుతం 50% స్వదేశీ భాగాలతో రైఫిల్‌లను తయారు చేస్తున్నారు. 2025 చివరి నాటికి 100% స్వదేశీకరణ సాధించనున్నారు. ఆ తర్వాత ఉత్పత్తి వేగం గణనీయంగా పెరగనుంది. ప్రతి 100 సెకన్లకో రైఫిల్ తయారు చేయగల సామర్థ్యంతో, నెలకు 12,000 రైఫిల్‌లు, ఏటా సుమారు 1.5 లక్ష రైఫిల్‌లు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా భారత్‌లోని రక్షణ తయారీ రంగం స్వయం ఆధారితత వైపు పెద్ద మైలురాయిగా నిలుస్తుంది.

ఇన్సాస్ (INSAS Assault Rifle) : భారత సైన్యం మూడు దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న INSAS (Indian Small Arms System) రైఫిల్‌ 5.56x45mm NATO కార్ట్రిడ్జ్‌తో పనిచేసే INSAS రైఫిల్ గ్యాస్ ఆపరేటెడ్, సింగిల్ షాట్ లేదా మూడు రౌండ్ బర్స్ట్ మోడ్‌లలో ఫైర్ చేయగలదు. నిమిషానికి 600-650 రౌండ్లు పేల్చే సామర్థ్యం కలిగిన ఈ రైఫిల్ యొక్క పరిధి 400 మీటర్లు. తేలికగా ఉండటం, సముద్ర, భూసైనిక ఆపరేషన్లకు సరిపోవడం దీని బలం. అయితే, ఆధునిక యుద్ధ పరిస్థితుల్లో అధిక శక్తి, రేంజ్ మరియు ఫైర్ రేట్ అవసరాలు పెరగడంతో కొత్త రైఫిల్ అవసరమైంది.

ఏకే–47: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే AK-47 రైఫిల్ 7.62x39mm క్యాలిబర్‌తో రూపొందించబడింది. 1940ల చివరలో సోవియట్ యూనియన్‌లో మిఖాయిల్ కలష్నికోవ్ రూపకల్పన చేసిన ఈ రైఫిల్ సులభ వినియోగం, విశ్వసనీయత, తక్కువ తయారీ ఖర్చుతో ప్రసిద్ధి చెందింది. ఇది అనేక దేశాలు, గ్రూపుల వినియోగంలో ఉండి, కోల్డ్ వార్ కాలంలో సోవియట్ శక్తికి ప్రతీకగా నిలిచింది. AK-47 యొక్క అనేక వెర్షన్లు — AKM, AK-74, AK-12 వంటి రైఫిల్‌లు — యుద్ధరంగాల్లో విశ్వసనీయ ఆయుధాలుగా నిలిచాయి.

INSAS పై AK-203 ఆధిక్యం:

INSAS రైఫిల్‌లతో పోల్చితే AK-203 తక్కువ బరువు (INSAS 4.15 కిలోలు) మరియు తక్కువ పొడవు (705 మిల్లీమీటర్లు, INSAS 960 మిల్లీమీటర్లు) కలిగి ఉండటం వల్ల సైనికుల మోయదగిన సామర్థ్యాన్ని పెంచుతుంది.. టెలిస్కోపిక్ బట్‌స్టాక్, ఆధునిక ఆప్టిక్స్ అమర్చే వీలు వంటి ఫీచర్లు కూడా యుద్ధ సన్నివేశాలలో వీటిని మరింత సమర్థవంతంగా మారుస్తాయి.

వినియోగం మరియు వ్యూహాత్మక ప్రాధాన్యత:

ఈ రైఫిల్‌లు ముఖ్యంగా కౌంటర్ ఇన్సర్జెన్సీ, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించనున్నాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) మరియు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) వద్ద విధులు నిర్వహిస్తున్న సైనికులకు ఇవి ప్రధాన ఆయుధాలుగా ఇవ్వబడతాయి. పర్వత ప్రాంతాలు, హై ఆల్టిట్యూడ్ వార్‌ఫేర్ వంటి పరిస్థితుల్లో AK-203 యొక్క సరళత మరియు బలమైన రూపకల్పన సైన్యానికి విశేష సహకారం అందిస్తుంది.

అంతర్జాతీయ ఆసక్తి:

AK-203 రైఫిల్‌లకు భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల నుండి ఎగుమతులపై విచారణలు జరుగుతున్నాయి. భారత రాష్ట్రాలు, యూనియన్ టెర్రిటరీలు మరియు పరామిలిటరీ దళాలు కూడా ఈ రైఫిల్‌లను వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నాయి.