ఆకాశా ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు

ఆకాశా ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు

విధాత‌: విమానంలో ఉన్న ప్ర‌యాణికుడు తన బ్యాగ్‌లో బాంబు (Bomb) ఉందంటూ అర‌వ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. ఆ విమానాన్ని ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేసి ప‌రిశీలించ‌గా అది అంతా ఉత్తిదే న‌ని తేల‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. పుణె నుంచి దిల్లీకి 185 మందితో వెళుతున్న‌ ఆకాశ ఎయిర్‌లైన్స్ (Akasa Airlines) విమానంలో శుక్ర‌వారం అర్ధ‌రాత్రి ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. పుణెలో విమానం టేకాఫ్ అయిన అనంత‌రం గాలిలో ఉండ‌గా.. ఒక యువ‌కుడు లేచి నా బ్యాగ్‌లో బాంబు ఉందంటూ అరిచాడు.


దీంతో అప్ర‌మ‌త్త‌మైన పైల‌ట్ ముంబ‌యి విమానాశ్ర‌యం అధికారుల‌కు స‌మాచార‌మిచ్చాడు. ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమ‌తిచ్చిన సిబ్బంది బాంబ్ డిటెక్ష‌న్ అండ్ డిస్పోజ‌ల్ స్వ్కాడ్స్ (బీడీడీఎస్‌) కు స‌మాచారం ఇచ్చారు. శ‌నివారం ఉద‌యం 2:30 గంట‌ల‌కు విమానం ల్యాండ్ అవ‌గానే స‌ద‌రు వ్య‌క్తిని అరెస్టు చేసిన పోలీసులు విమానాన్ని జ‌ల్లెడ ప‌ట్టారు. అత‌డు చెబుతున్న బ్యాగ్‌ను సైతం చెక్ చేశారు. అయినా అందులో ఏదీ క‌న‌ప‌డ‌లేదు.


దీంతో విమానాన్ని ఉద‌యం 6:00 గంట‌ల‌కు దిల్లీకి పంపించేశారు. అయితే నిందితుడు ఇలా ఎందుకు ప్ర‌వ‌ర్తించార‌నే దానిపై ఒక అధికారి స్పందించారు. విమానంలో నిందితుడితో పాటే వారి బంధువూ ప్ర‌యాణిస్తున్నార‌ని తెలిపారు. నిందితుడు విమానం ఎక్కే మందుకు గుండె నొప్పికి ఒక మందు తీసుకున్నాడ‌ని… దాని ప్ర‌భావంలో పిచ్చి వాడిలా మాట్లాడుతున్నాడ‌ని ఆయ‌న చెప్పిన‌ట్లు పేర్కొన్నారు.