క్యాన్సర్ మందు అమెరికాలో రూ.85వేలు..భారత్ లో రూ.35: అమెరికన్ మహిళ వీడియో వైరల్

అమెరికా, భారత్ దేశాల మధ్య ఔషధాల ధరల్లో ఉన్న భారీ వ్యత్యాసాన్ని వివరిస్తూ ఓ అమెరికన్ మహిళ రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాలో రూ.85,000 విలువైన 'రెవ్లిమిడ్' క్యాన్సర్ మందు, భారత్‌లో కేవలం రూ.35కే లభించడంపై అమెరికన్ మహిళా ఈ వీడియోలో వివరించడం చర్చనీయాంశమైంది.

విధాత : అమెరికా, భారత్ దేశాల మధ్య ఔషధాల ధరల్లో ఉన్న భారీ వ్యత్యాసాన్ని వివరిస్తూ ఓ అమెరికన్ మహిళ రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాలో రూ.85,000 విలువైన ‘రెవ్లిమిడ్’ క్యాన్సర్ మందు, భారత్‌లో కేవలం రూ.35కే లభించడంపై అమెరికన్ మహిళా ఈ వీడియోలో వివరించారు. భారత్‌లో తక్కువ ధరకే వైద్యం అందుతోందని, అమెరికన్ ఆరోగ్య వ్యవస్థ తమను దోచుకుంటోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం భారత్‌లో నివసిస్తున్న లిజ్ అనే అమెరికన్ మహిళ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. తన అత్త బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ఆమె వాడే ‘రెవ్లిమిడ్’ అనే ఔషధం అమెరికాలో ఒక్కో మాత్ర ధర సుమారు 900 డాలర్లు (దాదాపు రూ. 85,000) ఉంటుందని తెలిపారు. అయితే, అదే మందు జెనరిక్ వెర్షన్ భారత్‌లో కేవలం రూ. 35 నుండి రూ. 300 మధ్యనే లభ్యమవుతోందని ఆమె వివరించారు. “అమెరికాలో మమ్మల్ని దోచుకుంటున్నారు” అని ఆవేదన వ్యక్తం చేసిన లిజ్, భారత్‌లో అందుబాటులో ఉన్న చవకైన వైద్య సేవలను కొనియాడారు. ఈ వీడియోకు లక్షలాది వ్యూస్ లభించడంతో, అంతర్జాతీయంగా ఫార్మా ధరలు, బీమా వ్యవస్థలు, జెనరిక్ ఔషధాల లభ్యతపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చ మొదలైంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మందుల కోసం విమానంలో భారత్ వెళ్లడమే మేలని కామెంట్స్ చేస్తున్నారు.

అమెరికాలో పేటెంట్ హక్కులు, కఠినమైన నిబంధనలు, మార్కెట్ పరిస్థితుల కారణంగా బ్రాండెడ్ ఔషధాల ధరలు విపరీతంగా ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో, జెనరిక్ ఔషధాల తయారీలో భారత్ అగ్రగామిగా ఉండటం వల్ల ఇక్కడ ధరలు చాలా తక్కువగా ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. అమెరికాలో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ, అక్కడి హెల్త్‌కేర్ సిస్టమ్ ఎంత ఖరీదైనదన్న విషయం అమెరికన్ మహిళ వీడియోతో తెలుసుకోవచ్చంటున్నారు నెటిజన్లు.

Latest News