గాలే వేదికగా శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్ లో 206 పరుగులకే ఆలౌటైంది. దీంతో 165 పరుగుల తేడాతో టీమ్‌ఇండియా విజయం సాధించడం ద్వారా.. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. లంక రెండో ఇన్నింగ్స్ లో ఐదో రోజు బుధవారం 84/4వికెట్లతో ఆట ప్రారంభించిన లంక బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. సోనాల్ దినుష (84), ధనంజయ డిసిల్వా (59) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 6/55, ప్రసిద్ధ్ కృష్ణ 2.. సిరాజ్, జడేజా చెరో వికెట్ తీశారు. మానవ్ సుతార్ ఒకే ఓవర్‌లో (76వ) మూడు వికెట్లు తీయడం విశేషం. సోనాల్ దినుష (84), ప్రభాత్ జయసూర్య (0)ను వరుస బంతుల్లో ఔట్ చేసిన అతడు.. ఓవర్ చివరి బంతికి లాహిరు కుమార (0)ను పెవిలియన్‌కు చేర్చాడు.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులు చేయగా.. శ్రీలంక 284 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 193 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మానవ్ సుతార్ 10 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ(167) తో పాటు రెండో ఇన్నింగ్స్ లో విలువైన 44పరుగులు చేసిన దేవదత్ పడిక్కల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇక ఈ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ స్థానం మారనప్పటికీ.. పర్సంటేజీని మాత్రం బాగా పెంచుకుంది. ప్రస్తుతం 53.33 శాతంతో ఐదో స్థానంలో ఉంది. భారత్ ఖాతాలో 60 పాయింట్లు ఉన్నాయి. ఇక రెండో టెస్టు ఆగస్టు 22 నుంచి 27 వరకు కొలంబో వేదికగా జరగనుంది.