టికెట్ ధరల పెంపు ఆదాయంలో 20శాతం సంక్షేమానికే: తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వులు

సినిమా టికెట్ ధరల పెంపుతో వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతాన్ని తెలుగు సినీ పరిశ్రమ ఉద్యోగుల సంక్షేమం కోసం టీజీఎఫ్‌డీసీకి చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Reported by: Tejaswini Nanna | వినోదం | Aug 19, 2026, 3:27 pm IST
Read Time: 4 mins
టికెట్ ధరల పెంపు ఆదాయంలో 20శాతం సంక్షేమానికే: తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వులు

సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్‌ ధరలను పెంచడం ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC)కి సంక్షేమ విరాళంగా చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మొత్తాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంక్షేమం కోసం వినియోగించనున్నట్లు పేర్కొంది. ఇటీవల విడుదలైన, త్వరలో రాబోతున్న పలు భారీ చిత్రాలకు సంబంధించి ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. టికెట్‌ ధరల పెంపుతో వచ్చే అదనపు రాబడిపై వర్తించే 20 శాతం వాటాను ఎగ్జిబిటర్ల నుంచి సంబంధిత చిత్రాల నిర్మాతలే వసూలు చేయాలని పేర్కొంది. అనంతరం వసూలు చేసిన మొత్తాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సమాఖ్య సంక్షేమ సంఘం ఖాతాకు జమ చేయాలి. ఈ ఖాతాను తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (TGFDC) ద్వారా నిర్వహించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలు ‘అఖండ-2’, ‘ది రాజాసాబ్‌’, ‘మన శంకర వర ప్రసాద్‌ గారు పండుగకు వస్తున్నారు’, ‘పెద్ది’ చిత్రాలకు కూడా వర్తిస్తాయి.ఈ నాలుగు చిత్రాల నిర్మాతలకు ఎగ్జిబిటర్ల నుంచి 20 శాతం సంక్షేమ విరాళాన్ని వసూలు చేసి, ప్రభుత్వం సూచించిన ఖాతాలో జమ చేసే అధికారాన్ని కల్పించారు.

ఈ మేరకు 14 రీల్స్‌ ప్లస్‌ ఎల్‌ఎల్‌పీ, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, షైన్‌ స్క్రీన్స్‌ ఇండియా, వృద్ధి సినిమాస్‌ సంస్థలకు ప్రభుత్వం లేఖలు పంపింది. సంబంధిత నిర్మాతలు ఎగ్జిబిటర్ల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసి, టీజీఎఫ్‌డీసీ ద్వారా నిర్వహించే తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఖాతాలో జమ చేయాలని హోం శాఖ ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత నిర్మాతలకు సూచించింది.