కునో నేష‌న‌ల్ పార్కులో మ‌రో చీతా మృతి.. 10కి చేరిన మ‌ర‌ణాలు

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని కునో జాతీయ పార్కులో మ‌రో చీతా మృతి చెందింది. దీంతో చీతా మ‌ర‌ణాల సంఖ్య 10కి చేరింది

కునో నేష‌న‌ల్ పార్కులో మ‌రో చీతా మృతి.. 10కి చేరిన మ‌ర‌ణాలు

భోపాల్ : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని కునో జాతీయ పార్కులో మ‌రో చీతా మృతి చెందింది. దీంతో చీతా మ‌ర‌ణాల సంఖ్య 10కి చేరింది. మంగ‌ళ‌వారం మృతి చెందిన చీతాను శౌర్య‌గా గుర్తించారు. 2023 మార్చి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 10 చీతాలు మ‌ర‌ణించ‌గా, అందులో మూడు పిల్ల‌లు ఉన్నాయి.మంగ‌ళ‌వారం ఉద‌యం శౌర్య అనే చీతా తూలుతూ న‌డ‌వ‌డాన్ని ట్రాకింగ్ బృందం గుర్తించింది. దీంతో ఆ చీతాకు చికిత్స అందించారు. చికిత్స అనంత‌రం ఆ చీతా కోలుకున్న‌ట్లే క‌నిపించిన‌ప్ప‌టికీ, మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మ‌యంలో ప్రాణాలు కోల్పోయిన‌ట్లు పార్కు అధికారులు ధృవీక‌రించారు. చీతా మృతికి గ‌ల కార‌ణాలు పోస్టుమార్టం త‌ర్వాతే తేల‌నున్నాయి.

అంత‌రించిపోయిన ఈ వన్య‌ప్రాణి జాతిని ఇండియాలో పునఃప్ర‌వేశ‌పెట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్రాజెక్టు చీతాను చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా న‌మీబియా, ద‌క్షిణాఫ్రికా దేశాల నుంచి 2022 సెప్టెంబ‌ర్, 2023 ఫిబ్ర‌వ‌రిలో రెండు విడ‌త‌ల్లో భాగంగా 20 చీతాల‌ను కునో పార్కుకు తీసుకొచ్చారు.కునో పార్కులో గ‌తేడాది మార్చిన తొలిసారిగా షాషా అనే చీతా కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ చ‌నిపోయింది. ఆ త‌ర్వాత ఆగ‌స్టులో ధాత్రి అనే ఆడ చీతా మృతి చెందింది. ఏప్రిల్ 13న ఉద‌య్ చ‌నిపోగా, నెల రోజుల‌కే ద‌క్షా అనే ఆడ చీతా ప్రాణాలు కోల్పోయింది. న‌మీబియా నుంచి తీసుకొచ్చిన ఓ చీతా అదే నెల‌లో నాలుగు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇందులో మూడు పిల్ల‌లు అనారోగ్యంతో మృతి చెందాయి. జులై 11, 14 తేదీల్లో రెండు మగ చీతాలు తాజాస్, సూర‌జ్ ప్రాణాలు కోల్పోయాయి.