రామప్ప ఖ్యాతిని ప్రపంచానికి చాటాలి: రాష్ట్ర మంత్రి సీతక్క
రామప్ప ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలనీ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శతాబ్దాల క్రితం ఈ ఆలయాన్ని ఇంత గొప్పగా నిర్మించారంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు.

విధాత, వరంగల్ ప్రతినిధి:రామప్ప ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలనీ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శతాబ్దాల క్రితం ఈ ఆలయాన్ని ఇంత గొప్పగా నిర్మించారంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. ఇదంతా మన చారిత్రక సంపదగా గుర్తించి భావితరాలకు దీని ప్రాముఖ్యతను వివరించాలన్నారు. గురువారం పాలంపేట లో నిర్వహిస్తున్న వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ క్యాంప్ శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. కాకతీయుల చరిత్ర గురించి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రంతోపాటు విదేశాల నుండి వచ్చిన విద్యార్థిని, విద్యార్థులను హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక శిల్పి తన జీవితాన్ని అంతా ఇక్కడ కేంద్రీకరించి పనిచేస్తే ఇలాంటి ఆలయాన్ని, శిల్పాలకు జీవం పోస్తారన్నారు. ఈ శిల్పకళలోని గొప్పతనానికి మనం గర్వించాలన్నారు. తన జీవితం లో ఏ విధంగా ఈ స్థితికి వచ్చానో వివరించారు. మీరు కూడా కష్టపడి ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. మీ ప్రాంతాల్లో కాకతీయుల గురించి, వారి శిల్పకళా నైపుణ్యం, రామప్పలాంటి దేవాలయాల గొప్పదనాన్ని వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాండురంగారావు, డాక్టర్ కుసుమ సూర్య కిరణ్, ప్రొఫెసర్ వెంకట్ రెడ్డి, వైఎల్ శ్రీనివాస్,డాక్టర్ జి మహేష్ తదితరులు పాల్గొన్నారు.