THUMMALA | రైతు భరోసాపై.. బీఆరెస్‌ డ్రామాలు

  • By: sr    news    Jun 21, 2025 8:16 PM IST
THUMMALA | రైతు భరోసాపై.. బీఆరెస్‌ డ్రామాలు

హైదరాబాద్‌: ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల సాగులో ఉన్న భూములను గుర్తించి రైతుభరోసా నిధులు విడుదల చేయడంలో జరిగిన ఆలస్యాన్ని రాజకీయంగా వాడుకొని లబ్ధి పొందాలనే ఆలోచనలు ఒక్క బీఆరెస్‌ నాయకులకే చెల్లుతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు విమర్శించారు. ఐదు రోజుల్లో రైతు భరోసా కింద 7310.59 కోట్ల నిధులు విడుదల చేయగానే బీఆరెస్‌ నాయకులు డ్రామాలు మొదలు పెట్టారని ఆయన మండిపడ్డారు. కోతల ప్రభుత్వమని ప్రజలు తిరస్కరించిన పార్టీ బీఆరెస్‌ అన్నారు.

పంట పండే ప్రతీ గుంటకు రైతుభరోసా చెల్లించే బాధ్యత తమదని స్పష్టం చేశారు. రైతుల తరపున పేటెంట్లు తీసుకొనే బీఆరెస్‌ నాయకులు.. వాళ్ళ పదవీకాలంలో అమలు చేసిన రుణమాఫీని గుర్తుచేసుకొంటే రైతుల ముందుకు రావడానికి కూడా వాళ్లకు ముఖం చెల్లదని అన్నారు. రైతుబంధు నిధులను ఎన్ని నెలల పాటు విడుదల చేసారో ఒక్కసారి తిరిగి చూసుకోవాలని సలహా ఇచ్చారు.