Bhu Bharati: భూ భారతి..10లక్షలకు పైగా భూ సమస్యల దరఖాస్తులు

- పదేళ్లలో భ్రష్టుపట్టిన రెవెన్యూ వ్యవస్ద
- సమూలంగా ప్రక్షాళన చేస్తున్నాం
- భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
- అందుకోసమే భూ భారతి తెచ్చాం
- మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది
- ముగిసిన రెవెన్యూ సదస్సులు
- మూడు విడతల్లో 10వేల సదస్సులు,
- 8.58 లక్షల దరఖాస్తుల స్వీకరణ
- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్: దశాబ్దకాలం పాటు బి.ఆర్.ఎస్ పాలనలో విధ్వంసమైన రెవెన్యూ వ్యవస్ధను ప్రక్షాళన చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్వరాష్ట్రంలో ఏళ్ల తరబడి తెలంగాణ ప్రజానీకం ఎదుర్కొన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఆశయంతో తీసుకువచ్చిన భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు. రెవెన్యూ వ్యవస్దలో భూ భారతికి ముందు భూ భారతి తర్వాత స్పష్టమైన మార్పు కనిపిస్తుందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ముగిసిన నేపథ్యంలో మంత్రి శనివారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి ప్రభుత్వం ఎంతో గొప్పగా 2020లో తీసుకువచ్చిన ఆర్వోఆర్ చట్టాన్ని తిరగరాసి పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తూ రైతులు కష్టాలు తీర్చడమే ధ్యేయంగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. పదేళ్లలో రైతులు పడ్డ కష్టాలు బాధలు వారు ఏవిధమైన సమస్యలను ఎదుర్కొన్నారో చెప్పడానికి ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు.
మూడు దశల్లో రెవెన్యూ సదస్సులు
మూడు దశల్లో దాదాపు 10లక్షలకు పైగా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయన్నారు. ఏప్రిల్ 14వ తేదీన భూభారతి చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగిందని ఆరోజు నుంచే రెవెన్యూ వ్యవస్దలో నూతన శకం ప్రారంభమైందన్నారు. ఈ చట్టాన్ని దశల వారీగా అమలులోకి తీసుకురావడం జరిగిందని మొదటి దశలో ఏప్రిల్ 17 నుంచి 30వ తేదీ వరకు 4మండలాల్లో నిర్వహించిన 72 రెవెన్యూ సదస్సుల్లో 12వేల దరఖాస్తులు , తర్వాత రెండవ దశలో మే 5వ తేదీ నుంచి 28 మండలాల్లో నిర్వహించిన 414 సదస్సుల్లో 46 వేల దరఖాస్తులు రాగా సాదాబైనామాల అంశం మినహా సుమారు 60 శాతంపైగా సమస్యలకు పరిష్కారం చూపడం జరిగిందన్నారు.
ఈ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 561 మండలాల్లో 10,239 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించామని ఈ సదస్సుల్లో భూ సమస్యలకు సంబంధించి 8 లక్షల దరఖాస్తులు వచ్చాయని మొత్తంగా మూడు విడతల్లో 593 మండలాల్లో 10,725 రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, ఇందులో 8.58 లక్షల దరఖాస్తులు వచ్చాయని వివరించారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 67వేలు, భద్రాద్రి కొత్తగూడెం 61వేలు, వరంగల్ 54 వేలు, జయశంకర్ భూపాలపల్లి 48వేలు, నల్గొండ 42 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
రెవెన్యూ సదస్సులకు ముందురోజే ఆయా గ్రామాల్లో రైతులకు ఉచితంగా దరఖాస్తులను ఇవ్వడం జరిగిందని ఎమ్మార్వో ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని రెవెన్యూ అధికారులే ప్రజల వద్దకు వచ్చి ఎలాంటి రుసుము లేకుండా దరఖాస్తులను స్వీకరించారని తెలిపారు. స్వీకరించిన వాటికి రశీదులను అందజేయడం జరిగిందన్నారు. వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటివరకు 3.27 లక్షల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం జరిగిందని, మిగిలిన వాటిని కూడా త్వరితగతిన నమోదు చేయాలని అధికారులకు సూచించారు.