కాంగ్రెస్‌ గెలిస్తే రైతు రుణ మాఫీ చేస్తాం: రాహుల్‌

కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ప్రకటించారు

కాంగ్రెస్‌ గెలిస్తే రైతు రుణ మాఫీ చేస్తాం: రాహుల్‌

ఉపాధి హామీ కూలి 400కు పెంపు
ఆశ, అంగన్‌వాడీల వేతనాలు రెట్టింపు
పేద మహిళలు, యువత లక్షాధికారులు
మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌

భోపాల్‌: కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్‌గావ్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో మే 6, 2024న నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో రాహుల్‌ మాట్లాడారు. మధ్యప్రదేశ్‌లో ఒక గిరిజనుడిపై బీజేపీ నేత మూత్ర విసర్జన చేసిన విషయాన్ని ప్రస్తావించిన రాహుల్‌.. ‘మీవాళ్లు ఆదివాసీలపై ఎందుకు మూత్ర విసర్జన చేస్తున్నారో మోదీని ప్రశ్నించాలి. రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలని అనుకుంటున్నారో నిలదీయాలి.

రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారో ప్రశ్నించాలి. ఆయన ఏం చెప్పినా సరే.. మోదీని మీరు ఈ ప్రశ్నలు అడగాలి’ అని అన్నారు. ఈ ఎన్నికల్లో రాజ్యాంగం, రిజర్వేషన్ల పరిరక్షణ, పేదలకు రక్షణ.. ఇవే కీలక అంశాలని రాహుల్‌ చెప్పారు. ‘ప్రతి పేద కుటుంబానికి మేం లక్ష రూపాయలు ఇస్తాం. యువతకు లక్ష రూపాయలు ఇస్తాం. మేం రైతుల రుణాలు మాఫీ చేస్తాం. ఆశ వర్కర్లు, అంగన్‌వాడీల వేతనాలను రెట్టింపు చేస్తాం. ఉపాధి హామీ చట్టం కింద రోజుకూలీని రూ.400కు పెంచుతాం. మోదీని అడగండి.. ఆయన ఏంచేస్తారో’ అని రాహుల్‌ అన్నారు.