మావోయిస్టు శిబిరంలో ప్రకంపనలు..పార్టీని కుదిపేస్తున్న లొంగుబాట్లు
మావోయిస్టు పార్టీలో నెలకొన్న ప్రకంపనలు, ఆ పార్టీతో పాటు విప్లవ శిబిరాన్ని కుదిపేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు మావోయిస్టు పార్టీలో వరుసగా దశలవారీగా జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.

- మావోయిస్టు శిబిరంలో ప్రకంపనలు
- ఆశావాహుల్లోనూ అనంతమైన చర్చ
- పార్టీని కుదిపేస్తున్న లొంగుబాట్లు
- నిన్నటి వరకు భారీ ఎన్కౌంటర్లూ
- ప్రస్తుతం పెద్ద ఎత్తున లొంగుబాట్లు
- పరిణామాల పై రాజకీయ విశ్లేషణలు
- ఎన్నడూలేనంత క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ
- భవిష్యత్ కార్యాచరణ పెద్ద అగ్నిపరీక్ష
విధాత, ప్రత్యేక ప్రతినిధి: మావోయిస్టు పార్టీలో నెలకొన్న ప్రకంపనలు, ఆ పార్టీతో పాటు విప్లవ శిబిరాన్ని కుదిపేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు మావోయిస్టు పార్టీలో వరుసగా దశలవారీగా జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర కమిటీ నాయకుల నేతృత్వంలో వందల సంఖ్యలో తుపాకులతో సహా ముఖ్యమంత్రుల ముందు లొంగిపోతున్న సంఘటనలే ప్రధానాంశంగా మారాయి. ప్రధాన స్రవంతి మీడియా కంటే సోషల్ మీడియాలో తాజా పరిణామాలపై విపరీతమైన చర్చ, అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నేటి నక్సలైట్ ఉద్యమం వరకు ప్రజా ఉద్యమాలకు, కమ్యూనిస్టు, విప్లవ వాతావరణానికి ఉమ్మడి రాష్ట్రం, అందులో తెలంగాణ కేంద్రంగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం, బీజేపి ఎవరికి ఎన్ని ముద్రలు వేసినప్పటికీ తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావం బాగా తగ్గిపోయినప్పటికీ ఆ రాజకీయ అభిప్రాయాలు, భావాలు, అభిమానులు, సానుభూతి పరులు, సమర్ధకులు, ఆశావాహుల సంఖ్య, నక్సలైట్లు ఉంటే అక్రమాలకు అడ్డుకట్టపడుతుందని వారు ఉండాలని కోరుకునే ఆకాంక్షవాదులు మొత్తంగా ఇలాంటి సమూహం ఇప్పటికీ తక్కువేమి లేదని చెప్పవచ్చు. అందుకే తాజా పరిణామాల ఆసక్తి కనబరుస్తున్నారు.
అక్కడ జరిగినా ఇక్కడ కేంద్రీకరణ
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రభావం ఒక విధంగా పూర్తిగా తగ్గి పక్కరాష్ట్రాలైన చత్తీస్ గడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఝార్కండ్, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో ముఖ్యంగా దండకారణ్యంలో మావోయిస్టు కార్యకలాపాలు జరుగుతున్న ఇప్పటికీ అక్కడ జరుగుతున్న సంఘటనలు, పరిణామాల ప్రభావం ఇక్కడ తీవ్రంగానే ఉంది. అక్కడ ఏం జరిగినా చెవులు రిక్కించి విన్నట్లుగా ఇక్కడ దానిపై చర్చ సాగుతోంది. గతంలో కంటే ఏడాది కాలంగా దండకారణ్యం లక్ష్యంగా కేంద్ర బలగాలు కగార్ పేరుతో చేస్తున్న ఈ కారణంగానే గత ఏడాది కాలంగా వందల సంఖ్యలో మావోయిస్టు ముఖ్యనాయకులు, కేడర్ ఎన్ కౌంటర్లలో మృత్యువాత పడ్డారు. చివరికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ రావు అలియాస్ బస్వరాజు, కేంద్ర కమిటీ నాయకులు మోడం బాలకృష్ణ, గణేష్ , వివేక్, సోరేన్, చలపతి, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డితో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో మరణించారు. ఈ వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగింది. ముఖ్యంగా కర్రెగుట్టలాంటి సంఘటనల సమయంలో చర్చ తీవ్రమైంది. సంఘటనలు, ఎన్కౌంటర్లు పక్క రాష్ట్రాల్లో జరిగినా తెలంగాణ కేంద్రంగా శాంతి చర్చల డిమాండ్ తెరపైకి రావడమంటే ఇక్కడ ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజాందోళనలు చేపట్టారు. ఎన్ని రూపాల్లో ప్రయత్నించినప్పటికీ కేంద్రంలోని బీజేపీ సర్కారు చర్చలకు ససేమిరా అంటూ అణచివేతను తీవ్రం చేసింది. 2025 ఆరంభం నుంచి ఇప్పటివరకు 248 మంది మావోయిస్టులు మరణించారని గణాంకాలు చెబుతున్నాయి. 2024 నుంచి చూస్తే ఈ సంఖ్య 390కి చేరింది.ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, జనవరి 2024 నుండి 2100 మంది నక్సలైట్లు లొంగిపోయారని..1785 మందిని అరెస్టయ్యారని, 477 మంది ఎన్ కౌంటర్ అయ్యారని వెల్లడించారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని తుడిచిపెట్టాలనే దృఢ సంకల్పానికి ఈ సంఖ్య అద్దం పడుతుందని తాజాగా అమిత్ షా పేర్కొన్నారు.
సాయుధ పోరాట విరమణ
చర్చల సందర్భంగా తెరపైకి అభయ్ తెచ్చిన ఆయుధాలు పక్కనపెట్టడం, సెప్టెంబర్ 17న సోనూ పేరులో వెల్లడైన 22 పేజీల లేఖలో కల్లోలం ప్రారంభమైంది. ఈ ప్రకటన పర్యవసానంగా తాజా లొంగుబాట్లకు దారితీసింది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోనూ అలియాస్ వేణుగోపాల్ రావు నాయకత్వంలో మహారాష్ట్ర సీఎం ముందు బుధవారం 61 మంది ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. అదే రోజు చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో 27 మంది తమ ఆయుధాలతో సరెండరయ్యారు. శుక్రవారం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు, రూపేష్ సహా 208మంది మావోయిస్టులు శుక్రవారం చత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు ఆయుధాలు, పేలుడు సామాగ్రీని ప్రభుత్వానికి అప్పగించారు. దండకారణ్యం సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి రూపేష్అలియాస్ తక్కెళ్ళపల్లి వాసుదేవరావు, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యులు, మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత, బస్తర్ డివిజన్ కార్యదర్శి రాజమన్,, 15మంది డివిజన్ కమిటీ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. జగ్దల్పూర్‌లో జరిగిన లొంగుబాటు కార్యక్రమంలో మావోయిస్టులు 153 ఆయుధాలను సరెండర్ చేశారు. వీటిల్లో 19 ఏకే-47 రైఫిళ్లు, 17 ఎస్‌ఎల్‌ఆర్ రైఫిళ్లు, 23 ఇన్సాస్‌లు, 1 ఇన్సాస్ ఎల్‌ఎంజీ, 303 రైఫిళ్లు 36, 11 బీజీఎల్, 4 కార్బైన్‌లు, 41 బోర్ షాట్‌గన్‌లు, పిస్తోళ్లు ఉన్నాయి. 208 మందిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు.
ఇంటా బయట అగ్నిపరీక్ష
మావోయిస్టు పార్టీలో తాజా పరిణామాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయుధాలతో కేంద్ర బలగాలతో యుద్ధం చేసి బతికిబట్టకట్టే పరిస్థితి లేనందున అనివార్యమైన పరిస్థితుల్లో లొంగిపోతున్నారనే అభిప్రాయం ఉంది. లొంగిపోయే వారూ ఆయుధాలు అప్పగించడం పట్ల వ్యతిరేక భావన ఉంది. ఆయుధాల అప్పగింతను సెంటిమెంట్ గా చూసే వారు కొందరతై తాజా పరిస్థితుల్లో లొంగిపోయే వారికి అనివార్యపరిస్థితులున్నందునే ఆయుధాలు అప్పగించారని చెబుతున్నారు. ఈ కారణంగా వారిపై ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నవారు. బస్తర్, మాడ్ లో తాజాగా నెలకొన్న పరిస్థితుల కారణంగానే ఆయుధాలతో లొంగిపోయేందుకు నాయకులు, కేడర్ సిద్ధమయ్యారని తాజాగా రూపేష్ వెల్లడించారు. ఇదిలా ఉండగా పార్టీలో భిన్నాభిప్రాయాలుంటే చర్చించి ఉమ్మడి నిర్ణయాన్ని అమలు చేయాల్సిన నేతలు లొంగుబాట పట్టడం శత్రువుకు ఉపయోగపడడమనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే కొందరు నిందాపూర్వక విమర్శలు చేస్తున్నారు. అయితే మాటలకు చేతలకు చాలా తేడా ఉంటదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. తాజాగా సాగుతున్న ఈ లొంగుబాటు పర్వం మరికొంతకాలం సాగే అవకాశం ఉందంటున్నారు. లొంగిపోని వారిపై అమిత్షా చెప్పినట్లు కగార్ కార్యాచరణ సాగే అవకాశం ఉంటుందంటున్నారు. ఈ క్రమంలో పార్టీలోని నాయకత్వం ఇప్పుడు అత్యంత తీవ్రమైన అగ్నిపరీక్షను ఎదుర్కొంటోందని చెప్పవచ్చు. ఉన్న నాయకత్వాన్ని కాపాడుకోవడం,కేడర్ కు నమ్మకాన్ని కలిగిస్తూ కష్టకాలాన్ని దాటేందుకు అవసరమైన కార్యాచరణ అమలు చేయడం ప్రస్తుత స్థితిలో అంత సులభమైన అంశం కాదంటున్నారు. పదునైన రెండంచుల కత్తిపై సాము చేయడంగా అభివర్ణిస్తున్నారు. ఇంటాబయట తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న తాజా పరిస్థితుల్లో పురోగమించడమో, సాగే యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడమో తప్ప మరో మార్గంలేదంటున్నారు. తాజా పరిణామాల పై పార్టీ ఏ విధంగా స్పందిస్తుందనే చర్చకూడా సాగుతోంది.