యాంటీ పేపర్ లీకేజీ బిల్లుకు లోక్ సభ ఆమోదం

యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పరీక్షల అక్రమాలపై కఠిన శిక్షలకు మార్గం సుగమం కాగా, వందేమాతరం బిల్లుకు రాజ్యసభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కేంద్రం ప్రవేశ పెట్టిన యాంటీ పేపర్ లీక్ బిల్లు.. పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌‌‌‌ఫెయిర్ మీన్స్) అమెండ్‌‌‌‌మెంట్ – 2026కు లోక్ సభ బుధవారం సుదీర్ఘ చర్చ అనంతరం ఆమోదించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది. బిల్లు ఆమోదం తర్వతా లోక్ సభ రేపటికి వాయిదా పడింది. నీట్‌ సహా పలు పరీక్షల పేపర్‌లు లీక్ కావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవ్వడం తెలిసిందే. జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన విద్యార్థి నిరసలు హింసాత్మకంగా మారి వివాదస్పదమయ్యాయి. విద్యార్ధుల నిరసనలకు దిగొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించారు. ఎన్టీఏలో సమూల ప్రక్షాళన చేశారు. పరీక్షల సమర్ధ నిర్వహణపై సంస్కరణల కోసం టాస్క్ ఫోర్స్ కమిటీని ప్రకటించారు. యాంటీ పేపర్ లీక్ బిల్లును సవరిస్తూ సోమవారం లోక్ సభలో సవరణ బిల్లును ప్రవేశ పట్టారు.

ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వ్యక్తిగత కేసుల్లో దోషులకు ఇప్పటివరకు 3-5 ఏళ్ల జైలు శిక్ష, రూ.10లక్షల వరకు జరిమానాను విధించేలా నూతన బిల్లులో పొందుపరిచారు. అదే వ్యవస్థీకృత నేరాల్లో అయితే 5-10 ఏళ్ల జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా ఉంది. దోషులకు పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం సవరణ బిల్లులో ఉంది.

అమిత్ షాపై రాహుల్ గాంధీ విమర్శలు..లోక్ సభలో గందరగోళం

న్యూఢిల్లీ : యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్బంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై చేసిన విమర్శలు రచ్చకు దారితీశాయి. జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్న విద్యార్థుల ఆందోళనలను అన్ని పార్టీలు గౌరవించాలని ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ కోరారు. తాను కొందరు విద్యార్థుల నుంచి సూచనలు తీసుకున్నానని, యువత ఆందోళనలను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. బీజేపీ నేతల పిల్లలు కూడా విద్యార్ధుల నిరసనలకు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. తీవ్ర వేదన తర్వాతే విద్యార్థులు ఆందోళనకు దిగారన్నారు. యువత సెంటిమెంట్‌ను అన్ని పార్టీలు గౌరవించాలని రాహుల్‌ కోరారు.

శాంతియుతంగా ఆందోళలను చేస్తున్న విద్యార్ధులపై పోలీసులు లాఠీచార్జ్, కాల్పులకు దిగారని, టియర్ గ్యాస్, పెల్లెట్‌ గన్‌లు, వాటర్ క్యానన్స్ ప్రయోగించారని ఆరోపించారు. విద్యార్ధులపై కాల్పులకు అమిత్ షా పోలీసులకు ఆదేశాలిచ్చారా? లేక పోలీసులు కాల్పులు జరిపిన సంగతి అమిత్ షా కు తెలియదా అని..అలాగైతే ఆయన అసమర్థ హోంశాఖ మంత్రిగా మిగిలిపోతారని రాహుల్ విమర్శించారు. కాల్పులకు ఆదేశాలు ఇచ్చారా లేదా అన్నదానిపై సభ్యుడిగా ప్రశ్నించడం తన హక్కు అని వాదించారు. రాహుల్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఆయన క్షమాపణలు చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేస్తూ నినాదాలకు దిగారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చకు సమాధానమిస్తూ..కాల్పులు జరుపనప్పుడు ఆదేశాలు ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు. పోలీసులు కేవలం టీయర్ గ్యాస్ మాత్రమే ప్రయోగించారని, కాల్పులు జరుపలేదని, కాల్పులు జరిపారంటూ రాహుల్ ఆరోపించడం అభ్యంతరం అని స్పష్టం చేశారు. హోంమంత్రి విదేశాలకు వెళ్లారని ఆరోపణలు చేస్తున్నారని, ఆయన విదేశాలకు వెళ్లినట్లు మాకు సమాచారం లేదని చెప్పారు. అవాస్తవాలు చెప్పి సభ నుంచి వెళ్లడం బాధ్యతాయుతం కాదు అంటూ రాహుల్ కు హితవు పలికారు. అమిత్‌షాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు అని మండిపడ్డారు. అనంతరం యాంటీ పేపర్ లీక్ బిల్లుపై ఓటింగ్ నిర్వహించి ఆమోదించారు.

‘వందేమాతరం’పై బిల్లును ఆమోదించిన రాజ్యసభ

మరోవైపు జాతీయ గేయం వందేమాతరంపై బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. ఈ బిల్లును కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్‌ ఈ నెల 24న ప్రవేశపెట్టారు. వందేమాతరాన్ని అవమానించినా, ఆలపిస్తుండగా ఆటంకం కలిగించినా నేరంగా పరిగణించేలా చట్టం చేయనున్నారు. వందేమాతరం బిల్లులో భాగంగా ది ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్సల్ట్స్‌ టు నేషనల్‌ ఆనర్‌-1971లో సవరణలు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం జాతీయ గీతమైన జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణను వందేమాతరానికీ వర్తింపజేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.

Latest News