విధాత : అస్సాం, కేరళం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు(గురువారం) జరుగనుంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు, రాష్ట్రాల అధికార యంత్రాంగాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. తమిళనాడులో ఏప్రిల్ 23న, పశ్చిమ బెంగాల్ లో రెండువిడతలుగా ఏప్రిల్ 23న, 29న పోలింగ్ జరగనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మే 4న వెల్లడిస్తారు. మూడు రాష్ట్రాలు అస్సాం, కేరళం, పుదుచ్చేరి ఎన్నికల ప్రచారం ముగిసిపోగా.. ఎన్నికలలో విజయం కోసం అధికార, విపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి.
కేరళంలో పోటాపోటీ ప్రచారం
కేరళలో సీఎం పినరయి విజయన్ సారధ్యంలోని అధికార ఎల్డీఎఫ్ కూటమి, ప్రతిపక్ష కాంగ్రెస్ సారధ్యంలోని యూడీఎఫ్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. తమ ప్రభుత్వం విజయాలను పినరయి ప్రచారం చేయగా…ఆయన ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రతిపక్షాలు విమర్శలు సంధించాయి. కేరళంలోని 140 స్థానాలకు 883 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 2.71 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1.32 కోట్ల మంది పురుషులు, 1.39 కోట్ల మంది మహిళలు, 273 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. కేరళంలో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) వరుసగా మూడుసారి అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేయగా..కాంగ్రెస్ సారథ్యంలోని ఎల్డీఎఫ్ ఈసారి 100కి పైగా సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉంది.
అస్సాంలోనూ హోరాహోరీ
అస్సాంలో అధికార బీజేపీకి చెందిన హిమంత్ బిశ్వశర్మ ప్రభుత్వం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు గెలుపు కోసం ఎన్నికల ప్రచారాన్ని హోరాహోరీగా సాగించాయి. కాంగ్రెస్ పార్టీఓటు బ్యాంకు రాజకీయాలు, చొరబాటుదారులను ప్రోత్సహించడంపైన విమర్శలు గుప్పించిన బీజేపీ.. ఉమ్మడి పౌరస్మృతి-UCC, మహిళా రిజర్వేషన్లు , డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో ప్రచారం సాగించింది. మరో వైపు కేంద్ర రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలతో ప్రచారం నిర్వహించింది. మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ప్రతిపక్ష కూటమి తరపున జోరుగా ప్రచారం చేశారు. బీజేపీ ద్వేషపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని, అస్సాం సీఎం, ఆయన కుటుంబ సభ్యులు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు నగదు సాయం, ఆరోగ్య బీమా, స్థానిక ప్రజలకు భూమి హక్కులు కల్పిస్తామని హమీలు గుప్పించారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 126 స్థానాల్లో బరిలోకి దిగిన 722 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.ఇందులో 188 మంది ముస్లిం అభ్యర్థులు (దాదాపు 26 శాతం) ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.49 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును వెల్లడించబోతున్నారు. బంగ్లాదేశ్‌తో సరిహద్దు పంచుకుంటున్న ఈ రాష్ట్రంలో అస్తిత్వ రాజకీయాలు, భారీగా కొత్త ఓటర్ల చేరికతో రాష్ట్రంలో సమీకరణలు ఆసక్తికరంగా ఉన్నాయి. దాదాపుగా 40 శాతానికి చేరిన ముస్లిం జనాభా ఎన్నికల్లో కీలకంగా మారనుంది. బీజేపీ ఇక్కడ హ్యాట్రిక్ విజయం కోసం పోరాడుతుంది.
పుదుచ్చేరిలోనూ తగ్గని ప్రచార వేడి
పుదుచ్చేరిలోని 30 స్థానాలకు 294 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధానంగా ఎన్డీఏ- ఇండియా కూటమికి మధ్య పోటీ నెలకొంది.రెండు పార్టీలు విజయం కోసం జోరుగా ప్రచారం నిర్వహించాయి. ఇక్కడ మొత్తం 9,48,977 మంది ఓటర్లు ఉండగా, అందులో 4,45,761 మంది పురుషులు, 5,03,076 మంది మహిళలు, 140 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష కాంగ్రెస్ కూటముల మధ్య రసవత్తర పోరాటం నెలకొంది. గత 20 ఏళ్లుగా పుదుచ్చేరిలో ఏ అధికార పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికార పీఠాన్ని దక్కించుకోలేదు. ఈ ధఫా ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి, చరిత్ర తిరగరాయాలని ముఖ్యమంత్రి ఎన్. రంగసామి భావిస్తున్నారు. అయితే ‘దళపతి’ విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ ఎంట్రీతో పుదుచ్చేరి రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఎన్నికల్లో టీవీకే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
యుద్ధానికి రెండు వారాల బ్రేక్.. దిగొచ్చిన ట్రంప్.. హర్మూజ్‌ను తెరుస్తామన్న ఇరాన్
RAAKA | ‘రాకా’ ఫస్ట్ లుక్‌తో షాక్ ఇచ్చిన అల్లు అర్జున్.. అట్లీ ప్లాన్ ఏంటి?
