ముందుగా ప్రధాని విమానం అమ్మేయాలి : అవిముక్తేశ్వరానంద

ప్రజలకు పొదుపు సలహాలు ఇచ్చే ముందు ప్రధాని మోదీ రూ.8 వేల కోట్ల విమానం అమ్మేయాలని శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సంచలన వ్యాఖ్యలు చేశారు.

ముందుగా ప్రధాని విమానం అమ్మేయాలి : అవిముక్తేశ్వరానంద

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో విదేశీ మారక ద్రవ్య పొదుపుకు సహకరించాలంటూ ప్రజలకు సలహాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ముందుగా తను విదేశీ పర్యటనలకు వినియోగించే రూ. 8 వేల కోట్ల ఖరీదైన విమానాన్ని అమ్మేయాలని జ్యోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సంచలన సలహా ఇచ్చారు. ధర్మం అనేది ఇల్లు నుంచే మొదలవుతుందన్న ఆయన, ప్రజా ధనాన్ని వృథా చేయకుండా కేంద్ర ప్రభుత్వమే ముందుగా పొదుపు చర్యలు పాటించాలని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో తన ‘గోవిష్ట్ యాత్ర’ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు బంగారం కొనొద్దని, విదేశీ ప్రయాణాలు, ఇంధన వినియోగం తగ్గించుకోవాలని మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఖర్చులు తగ్గించుకోవాలని ప్రజలకు చెప్పడం కాదు, ముందుగా ప్రధాని రూ.8వేల కోట్ల విమానాన్ని అమ్మేయాలని, తక్కువ ఇంధనం ఖర్చయ్యే విమానాలను వాడాలని కోరారు. ప్రజలకు నీతులు చెప్పే ముందు పాలకులు ఆచరించి చూపాలని అవిముక్తేశ్వరానంద ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని విమానం అమ్మకపోయినా.. కనీసం తన కాన్వాయ్, తమ మంత్రులు, సహాయ మంత్రుల కాన్వాయ్‌లు తగ్గించుకున్నా, దేశానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారని ఇప్పటికే జనాలు సలహా ఇస్తున్నారని గుర్తు చేశారు. మంత్రులు, ఎంపీలు తమ జీతభత్యాల కూడా త్యాగం చేస్తారా అని ప్రశ్నించారు. పొదుపు చర్యలు అధికారంలో ఉన్నవారితోనే ప్రారంభం కావాలని హితవు పలికారు. పనిలో పనిగా కార్యకర్తల మీటింగ్‌లు కూడా ఆన్‌లైన్‌లో పెట్టుకుంటే కార్యకర్తల‌కు బోలెడు డబ్బులు పొదుపు అవుతాయనే చర్చ కూడా నడుస్తోందని వ్యాఖ్యానించారు. నిత్యం ధర్మం గురించి మాట్లాడే ప్రధాని మోదీ ఏ విధంగా పొదుపు చేస్తారో చూడాలని అవిముక్తేశ్వరానంద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో గోవధను అరికట్టడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. కేరళ (8%), పశ్చిమ బెంగాల్ (15%), జార్ఖండ్ (24%) వంటి రాష్ట్రాల్లో ఆవుల జనాభా పెరగగా, ఉత్తరప్రదేశ్‌లో మాత్రం గణనీయంగా తగ్గిపోయిందని ప్రభుత్వ గణాంకాలను ఉటంకించారు. గోవధకు పాల్పడే వారి నుంచి డబ్బులు తీసుకుంటూ కొందరు నాయకులురాజకీయం చేస్తున్నారని, అలాంటి వారిని ఓటర్లు నమ్మకూడదని పిలుపునిచ్చారు.

రాజు కంటే సన్యాసి పదవి చాలా ఉన్నతమైనదని, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం ద్వారా తన ఉన్నత స్థానం నుండి కిందకు దిగజారారని అన్నారు. ప్రస్తుతం ఆయన ఒక సీఎం మాత్రమే, సన్యాసి(పీఠాధిపతి) కాదంటూ విమర్శించారు. అలాగే యూపీ ప్రభుత్వ గోశాలల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, గోవుల సంరక్షణ, వాటి గౌరవాన్ని పునరుద్ధరించడంపై ఓటర్లలో అవగాహన కల్పించడమే తన యాత్ర ముఖ్య ఉద్దేశ్యమని శంకరాచార్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

విజయ్ కి ఊరట..ఒక్కడు తగ్గితే 31మంది వచ్చారు!
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి