Ayodhya Corporation Scam | అయోధ్య మున్సిపాలిటీలో 200 కోట్ల అవకతవకలు.. ఆడిట్‌లో వెలుగులోకి
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా విచ్చలవిడిగా కార్పొరేషన్ సొమ్మును దుర్వినియోగం చేశారన్న వార్తలు యూపీలో రాజకీయ దుమారం రేపాయి. అయోధ్య మున్సిపాలిటీ ఆడిటింగ్‌లో 200 కోట్ల రూపాయల మేరకు తేడాలు బయటపడ్డాయి.

Ayodhya Corporation Scam | మరోసారి అయోధ్య వార్తల్లోకి వచ్చింది. ఈసారి భక్తి విషయంలో కాదు.. ఆర్థిక అరాచకాల విషయంలో! అవును.. అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్‌లో లోకల్ ఫండ్ ఆడిట్ నిర్వహించగా.. దాదాపు 200 కోట్ల రూపాయల మేరకు లెక్కలు సరిపోలలేదు. ఇది ఉత్తరప్రదేశ్‌లో రాజకీయంగా దుమారం రేపింది. 2023–24 రిపోర్ట్‌లో స్టేట్ గ్రాంట్స్ దుర్వినియోగం, బడ్జెట్‌లో అవకతవకలు, బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీకి చెల్లింపులు వంటివి వెలుగు చూశాయి. ఈ చర్యలతో రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొత్తంగా ఈ అవకతవకలు సుమారు 200 కోట్ల వరకూ ఉంటాయని ఆడిట్ అధికారులు చెబుతున్నారు. అవకతవకలపై రిపోర్టును అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్, అకౌంటెంట్ జనరల్‌తోపాటు.. సీనియర్ డివిజనల్ అథారిటీలకు తగిన చర్యల నిమిత్తం పంపామని ఆడిట్ అధికారులు తెలిపారు.
ఈ అభియోగాలు రాజకీయ దురుద్దేశపూరితమైనవన్న అయోధ్య మేయర్, బీజేపీ నేత గిరీశ్ పాటి త్రిపాఠి.. నివేదికలో ప్రతి అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుని, దోషులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2024 జనవరిలో రామ మందిరం నిర్మాణం సందర్భంగా చేసిన ఏర్పాట్ల విషయంలో ప్రశ్నించతగిన చెల్లింపులు జరిగాయని సమాజ్‌వాది పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పవన్ పాండే ఆరోపించిన నేపథ్యంలో ఈ వివాదం మీడియాలో రచ్చకు దారి తీసింది. మత పరమైన సందర్భాలను కూడా బీజేపీ అవినీతికి వాడుకుంటున్నదని పాండే మండిపడ్డారు. అయితే.. పాండే వ్యాఖ్యలను త్రిపాఠి కొట్టిపారేశారు. అయోధ్య అభివృద్ధి చెందుతుంటే ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేక పోతున్నాయని ఆరోపించారు. అందుకే తన ప్రతిష్ఠను మంటగలిపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్రిపాఠి ప్రత్యారోపణలు ఎలా ఉన్నప్పటికీ.. అయోధ్యలో మతపరమైన కార్యక్రమాల నిర్వహణలో బలహీనమైన జవాబుదారీ తనాన్ని ఆడిట్ లెక్కలు బయటపెట్టాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సంక్షేమానికి ఉపయోగించాల్సిన నిధులను వేరే మార్గంలో ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ నిధులు అందాల్సిన బలహీన వర్గాలకు అందడం లేదని రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆడిట్ లెక్కల నేపథ్యంలో అయోధ్య అభివృద్ధికి వెచ్చించే మొత్తాల విషయంలో మరింత రాజకీయ, ఆర్థిక పారదర్శకత అవసరమని అంటున్నారు.