భారత్ లో బ్రిటీషర్ పునర్నిర్మించిన ఏకైక దేవాలయం ఏదో తెలుసా?

భారత్‌లో బ్రిటీష్ అధికారి చేత పునరుద్ధరించబడిన ఏకైక హిందూ దేవాలయంగా మధ్యప్రదేశ్‌లోని బైజ్‌నాథ్ (వైద్యనాథ్) ఆలయం చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందింది.

వ్యాపారం పేరుతో భారత్ కు వచ్చిన బ్రిటీషర్లు దేశాన్ని ఆక్రమించి వారి పాలనలోకి తెచ్చుకుని.. స్వాతంత్ర్యం కోసం ఉద్యమించిన భారతీయులను అణిచివేయడం చరిత్ర. చివరకు ప్రజా ఉద్యమానికి తలవంచి దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చేసిన బ్రిటీష్ పాలకులు తిరిగి వారి దేశానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే బ్రిటీషర్ల పాలనా కాలంలో దేశ సంపద దోపిడీకి గురవ్వడం..మత, సాంస్కృతిక, ప్రాథమిక హక్కుల అణిచివేత కొనసాగిందని చరిత్ర చెబుతుంది. అదే సమయంలో దేశానికి రైల్వేలు, విద్య, పారిశ్రామికం, సాగునీటి నిర్మాణాలు వంటి అంశాలలో కొంత మంచి జరిగిందని భావించే వారు ఉన్నారు.

బ్రిటిషర్ కట్టించిన ఏకైక దేవాలయం అది..

అయితే బ్రిటీషర్ల కాలంలోనూ ఓ హిందూ దేవాలయం పునరుద్దరించబడిందన్న అరుదైన సంగతి కూడా చోటుచేసుకోవడం ఇప్పటికి అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఆ దేవాలయమే మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ జిల్లాలోని అగర్ మాల్వాలోఉన్న బైజ్‌నాథ్(వైద్యనాథ్) ఆలయం. ఓ బ్రిటీష్ మిలటరీ అధికారి దంపతులు ఈ ఆలయాన్ని పునర్మించడం వెనుక ఓ ఆసక్తికర కథనం ప్రచారంలో ఉంది. బాణగంగా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం నిర్మాణం 1528లో ప్రారంభమై 1536లో పూర్తయింది. భారత దేశ చరిత్రలో ఒక బ్రిటీష్ అధికారి చేత పునరుద్దరించబడిన ఏకైక హిందూ ఆలయం ఇదే కావడం దీని ప్రత్యేకత.

పంచాక్షరీ మంత్రం పఠించిన బ్రిటీష్ కల్నర్ భార్య

ఉన్నతాధికారులు ఆదేశాలతో కల్నల్ మార్టిన్ అనే అధికారి తన పటాలంతో కలిసి 1880 అఫ్గాన్ యుద్ధంకు వెళ్ళాడు. అయితే యుద్దానికి వెళ్లిన తన భర్త కల్నల్ మార్టిన్ గురించి భార్య ఆందోళన చెందుతూ ఉంటుంది. భర్త కోసం బాధ పడుతున్న కల్నల్ మార్టిన్ భార్యకు వైద్యనాథ్ ఆలయ పూజారి పదకొండు రోజులు పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తే అంతా మంచి జరుగుతుందని చెప్పాడు. దానిని ఆమె పాటించి ఎంతో దీక్షతో పదకొండు రోజులపాటు పంచాక్షరీ మంత్రాన్ని పఠించింది. పదకొండో రోజు.. రోజంతా పంచాక్షరిని జపించింది. ఆ సాయంత్రం అవుతూ ఉండగా సేవకుడొకడు …కల్నల్ నుంచి లేఖ వచ్చింది అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఉద్వేగాన్ని ఆపుకుంటూ మార్టిన్ భార్య ఆ లేఖను తెరిచి చూసింది.

ఆ మహాశివుడే రక్షించాడేమో..

భార్యకు రాసిన ఆ లేఖలో కల్నల్ మార్టిన్ తాను క్షేమంగానే ఉన్నానంటూ…యుద్దంలో జరిగిన సంఘటనలు ఆమెకు ఏకరువు పెట్టారు. డియర్..గతంలో నీకు లేఖ వ్రాసిన మరుసటి రోజు నుంచే అఫ్గాన్లు మా పటాలాన్ని చుట్టుముట్టారు. నలు వైపుల నుంచి భీకరమైన దాడి చేశారు. మేమెవరమూ బతికి బట్టకట్టి బయటపడే పరిస్థితి లేదు. మా దగ్గర ఆయుధాలూ తక్కువే..ఆహారమూ తక్కువే. వాళ్లు వందల సంఖ్యలో ఉన్నారు. ఇక మా పని అయిపోయిందనుకున్నాను. ఓ అఫ్గాన్ పొడవాటి ఖడ్గంతో నాపై దూకాడు. నేను భయంతో కళ్లు మూసుకున్నాను. ఆ క్షణంలో నువ్వు తప్ప నాకింకెవరూ గుర్తుకురాలేదు.

అంతలో అద్భుతం జరిగిపోయింది..

మృత్యువు నా ముందున్న సమయంలో .. ఎవరో ఒక మనిషి అఫ్గాన్లపైకి దూకాడు. ఆయన్ని నేను అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఒళ్లంతా తెల్లగా ఏదో రాసుకున్నాడు. పులి చర్మం మొలకి కట్టుకున్నాడు. చేతుల్లో పొడవాటి శూలం లాంటి ఆయుధం ఉంది. ఆ శూలం కొన మూడుగా చీలి ఉంది. ఆయన ధాటికి అఫ్గాన్లు కకావికలమైపోయారు. కాలికి బుద్ధిచెప్పి పారిపోయారు. వాళ్లు పారిపోగానే ఆయన కూడా ఏమైపోయాడో తెలియదు. ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియదు. ఆయన ఆ క్షణాన వచ్చి ఉండకపోతే నేను నీకు దక్కేవాడిని కాదు డియర్ అంటూ లేఖలో యుద్ద ఘటనలను మార్టిన్ తన భార్యకు వివరించాడు. యుద్ధభూమిలో శత్రువుల దాడి నుండి శివుడే స్వయంగా ఒక యోగి రూపంలో వచ్చి తనను కాపాడాడని, తన భార్య ప్రార్థనల వల్లే తాను బతికి బయటపడ్డానని కల్నల్ మార్టిన్ లేఖలో పేర్కొన్నారు.

వైద్యనాధ్ మహిమతోనే …

అఫ్గాన్ యుద్ధం నుంచి తిరిగి వచ్చాక కల్నల్ మార్టిన్, ఆయన భార్య కొండమీద కొలువున్న బైద్యనాథ్ మహాదేవుడిని దర్శించుకున్నారు. వైధ్యనాధ్ మహిమతోనే యుద్దం నుంచి సురక్షితంగా బయపడ్డారని భావించారు. శిథిలావస్థలో ఉన్న ఆ దేవాలయం జీర్ణోద్ధరణకు రూ.15 వేలను సమర్పించుకున్నారు. మహాదేవ్ మందిరానికి పునరుద్దరణతో కొత్త శోభ వచ్చింది. వైద్యనాధ్ ఆలయం ముందు ఉన్న శిలాఫలకంపై తమ కథను కల్నల్ మార్టిన్, ఆయన భార్య లిఖింపచేశారు. కొన్నాళ్లకి కల్నల్ మార్టిన్ సతీ సమేతంగా ఇంగ్లాండ్ కు తిరిగి వెళ్లిపోయారు. అక్కడ కూడా వారి ఇంట్లో ఒక శివుడి విగ్రహం పెట్టుకున్నారు. కడవరకూ ఆయన్నే అర్చించడం మహాదేవుడి పట్ల వారి భక్తి విశ్వాసాలకు నిదర్శనం. ఆలయ ముందు శిలాఫలకంలో కల్నల్ దంపతుల కథ ఆధారంగా వైద్యనాధ్ ఆలయం భారత్ లో బ్రిటీషర్ నిర్మించిన ఏకైక హిందూ ఆలయంగా చరిత్రలో నిలిచిపోవడం విశేషం.

Latest News