BUDJET 2024 | సమతుల్య బడ్జెట్ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి … దేశ హిత బడ్జెట్ : కేంద్ర మంత్రి బండి సంజయ్
కేంద్రంలో ఎన్డీఏ నేతృత్వంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ నిర్మాణమే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టిందని సబ్ కా సాత సబ్‌కా వికాస్ లక్ష్యంగా సమతుల్యంగా బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.

విధాత, హైదరాబాద్ : కేంద్రంలో ఎన్డీఏ నేతృత్వంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ నిర్మాణమే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టిందని సబ్ కా సాత సబ్‌కా వికాస్ లక్ష్యంగా సమతుల్యంగా బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. బడ్జెట్‌పై ఆయన మీడియాతో మాట్లాడారు. దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారికి పన్ను ఆదా ప్రకటించిందని, వీధి వ్యాపారుల నుంచి మొదలు రైతులు, పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. పేదలను శక్తివంతం చేయడం, అన్నదాత ఉత్పాదక సామర్థ్యాలను పెంచేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని, పేదల కోసం కోటి పట్టణ పేద, మధ్యతరగతి కుటుంబాల గృహ అవసరాలను తీర్చడానికి 10 లక్షల కోట్ల పెట్టుబడిని కేంద్రం బడ్జెట్ లో ప్రతిపాదించిందని తెలిపారు. 4 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా బడ్జెట్ లో ప్రతిపాదనలు చేసిందని, అన్నదాతల కోసం వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.5 లక్షల కోట్లు బడ్జెట్ లో పెట్టామని, మహిళలు, బాలికలకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ.3 లక్షల కోట్ల మేర ప్రతిపాదనలు కేంద్రం చేసిందని తెలిపారు. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించేలా.. పన్ను స్లాబ్‌లను మార్చిందని, పెరిగిన స్టాండర్డ్ డిడక్షన్ ద్వారా 4 కోట్ల మందికి మేలు జరగనుందన్నారు.
ఇది దేశ హిత బడ్జెట్ : బండి సంజయ్
కేంద్ర బడ్జెట్ దేశ హితానికి, ప్రధాని మోదీ విజనరీకి అద్దం పట్టిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ఆయన హైదరాబాద్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. బడ్జెట్ లో ఏకంగా 11 లక్షల 50 కోట్ల రూపాయలను మౌలిక రంగాల అభివృద్ధికి కేటాయించడం గొప్ప విషయమని, దేశంపట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఉన్న కమిట్ మెంట్ కు నిదర్శనమన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 1.50లక్షల కోట్లు కేటాయించారని, విద్యకు పెద్దపీట వేశారని, 3 కోట్ల మందికి ఇండ్లు నిర్మించేలా బడ్జెట్ ప్రతిపాదనలు చేసిందన్నారు. మహిళలు, బాలికలకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ.3 లక్షల కోట్ల మేర ప్రతిపాదనలు చేయగా, 4 కోట్ల మందికి మేలు కలిగేలా ట్యాక్స్స్ శ్లాబులను రూపొందించారన్నారు. తెలంగాణకు నిధులివ్వలేదనడం కాంగ్రెస్, బీఆరెస్‌ల మూర్ఖత్వానికి నిదర్శనమని, తెలంగాణ సహా దేశంలోని వెనుకబడిన 150జిల్లాలకు కేంద్రం నిధుల కేటాయింపు చేసిందని వెల్లడించారు. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్ లో 210 కి.మీల తెలంగాణలో భాగమేననే విషయం తెల్వదా? అని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని నిపుణులు తేల్చిన సంగతి మర్చిపోయారా? అని విమర్శించారు. రాష్ట్ర విభజన చట్టంలో పోలవరంకు జాతీయ హోదా ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే అంశాన్ని పొందుపర్చనిది మీరు కాదా? అని ప్రశ్నించారు. ఓట్ల కోసం పైసలు పంచుడు, దంచుడు, అప్పుల్లో ముంచుడు తప్ప కాంగ్రెస్, బీఆరెస్ సాధించిందేమిటని మండిపడ్డారు. పోల పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ది చెప్పినా కాంగ్రెస్, బీఆరెస్‌ల వంకర బుద్ది మారలేదన్నారు. వరంగల్ లో టెక్స్ టైల్ పార్కును ఎన్నడో ప్రకటించడంతోపాటు నిధులు కేటాయించిన తరువాత మళ్లీ దీనిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేవారు. ఇకనైనా తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సహాయ సహకారాలపై నిర్మాణాత్మక సలహాలివ్వాలని కోరారు.