Modi Visit Srisailam : శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ
ప్రధాని మోదీ తొలిసారి శ్రీశైలం జ్యోతిర్లింగ క్షేత్రాన్ని సందర్శించి మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి నిర్వాహకులను అభినందించారు. ఈ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాని వెంట ఉన్నారు.

అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి ప్రముఖ జ్యోతిర్లింగా క్షేత్రం శ్రీశైలంను సందర్శించారు. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి మోదీ ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు, ఆలయ అధికారులు ప్రధానికి లాంఛనంగా స్వాగతం పలికారు. మల్లికార్జునస్వామికి పంచామృతాలలో రుద్రాభిషేకం, భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు. పూజల అనంతరం మోదీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఇక్కడి శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను తిలకించారు. దర్బార్ హాల్ లోశివాజీ విగ్రహానికి పుష్పాలను సమర్పించారు. అనంతరం శివాజీ ధ్యాన మందిరాన్ని కూడా సందర్శించారు. అక్కడ ధ్యానముద్రలో ఉన్న శ్రీ చత్రపతి శివాజీ, అమ్మవారి విగ్రహాలను తిలకించారు. అక్కడ కూడా అమ్మవారి విగ్రహానికి భక్తిశ్రద్ధలతో పుష్పాలను సమర్పించారు. శ్రీ చత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్ర నిర్వహణ బాగుందని ట్రస్ట్ నిర్వాహకులను ప్రధాని అభినందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులతో ప్రధాని ఫోటోషూట్ లో పాల్గొన్నారు. ప్రధాని వెంట ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నారు.
అంతకుముందు కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి ఓర్వకల్ ఎయిర్‌పోర్టులో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మంత్రి నారా లోకేశ్ లు స్వాగతం పలికారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.