Konda Surekha : పతాకస్థాయికి చేరిన కొండా వివాదం

మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ కేంద్రంగా వివాదం పతాకస్థాయికి చేరింది. సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు టాస్క్ ఫోర్స్ రాగా, సురేఖ కుమార్తె సుస్మిత అడ్డుకున్నారు. సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి, ఇతర రెడ్డి మంత్రులపై కుట్ర ఆరోపణలు చేశారు. ఈ వివాదంపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంగా ఉంది. మేడారం పనులను దేవాదాయ శాఖ నుంచి ఆర్‌అండ్‌బీకి మార్చారు.

Konda Surekha : పతాకస్థాయికి చేరిన కొండా వివాదం

విధాత, ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కేంద్రంగా ప్రారంభమైన వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. పతాక స్థాయికి చేరిన పంచాయతీలో ఆఖరికి సామాజికాంశం సైతం జతచేరి సీఎం రేవంత్ రెడ్డి కూడా టార్గెట్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ, మంత్రివర్గం ప్రతిష్ట బజారునుపడగా, ఉన్న కాస్తా పరువు గంగపాలైంది. తాడోపేడో తేల్చుకోవాల్సిన ఆఖరి అంకానికి పరిస్థితులు చేరాయంటున్నారు. రెడ్డివర్గం మంత్రులు, నాయకులంతా కలిసికట్టుగా బీసీ మహిళా మంత్రి సురేఖ పై కుట్రలు చేస్తున్నారంటూ ఆమె కుమార్తె సుస్మిత ఆరోపణలు చేసే స్థాయికి ఈ లొల్లి వెళ్ళింది. సురేఖ పేషీలో ఓఎస్డీగా పనిచేస్తున్న సుమంత్ కేంద్రంగా తాజా వివాదానికి పునాదులు పడ్డాయి. సుమంత్ పై పలు అవినీతి, బెదిరింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. డెక్కన్ సిమెంట్ యజమాన్యాన్ని తుపాకితో బెదిరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమంత్ ను ఓఎస్డీగా తొలగించినప్పటికీ మంత్రి ఆయనను వెనుకేసుకరావడంలో మతలబేమిటనే చర్చ సాగుతోంది. ఇంట్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉండగానే.. కొండా సురేఖ తన కారులో సుమంత్ను వెంట పెట్టుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటికి వెళ్లిపోవడం కొసమెరుపు… ఇదిలా ఉండగా నేను ఎవరికి టార్గెట్ కాదూ… నేను ఎవరిని టార్గెట్ చేయలేదు. అనేక టార్గెట్లు చూసే తాను ఈ స్థాయికి చేరుకున్నానని, తనను టార్గెట్ చేస్తే ఎదుటివారికే నష్టమంటూ మంత్రి సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఈ పరిణామాల పై వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వ్యవహారంలో తప్పెవరిదైనా వివాదానికి పుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. కొద్ది రోజులుగా జిల్లా ఎమ్మెల్యేలతో, మంత్రి, నాయకులతో తీవ్రమైన వివాదాల్లో కూరుకపోయి చివరికి మేడారం పర్యటకు, సీఎం హనుమకొండ పర్యటనకు దూరంగా ఉన్న మంత్రి సురేఖ గురువారం జరిగే కేబినేట్ మీటింగుకైనా హాజరవుతారా? లేదా? అనే సందిగ్ధం నెలకొంది. వరంగల్లో గురువారం జరిగే తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి సురేఖ హాజరవుతారని మురళి ప్రకటించిన నేపథ్యంలో కార్యకర్తల సమావేశానికి వస్తారా? కేబినేట్ మీటింగుకు వెళుతారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజా పరిణామాల పై పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.

సుమంత్ కోసం కొండా ఇంటికి టాస్క్ ఫోర్సు

పర్యావరణ మంత్రిగా ఉన్న సురేఖ శాఖ పరిధిలోని కాలుష్య నియంత్రణ మండలిలో నిన్నటి వరకు ఓఎస్టీగా పని చేస్తున్న ప్రైవేటు వ్యక్తి సుమంత్ ను ఆ బాధ్యతల నుంచి ఆకస్మికంగా తప్పిస్తూ శాఖ అధికారి రవి గుగులోతు ఉత్తర్వులు వెలువడిన రెండు రోజుల్లో చకచకా పరిణామాలు మారాయి. సుమంత్ పై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. హుజూర్ నగర్ లోని డెక్కన్ సిమెంట్ యజమాన్యాన్ని తుపాకితో బెదిరించారనే అందులో ఒకటి. సుమంత్ ను అరెస్ట్ చేసి వీటి పై విచారించేందుకు బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ లోని మంత్రి సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లారు. ఈ సందర్భంగా ఇంట్లో ఉన్న సురేఖ కుమార్తె సుస్మిత పోలీసులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. సుమంత్ అరెస్ట్ పై పోలీసులు సరైన కారణాలు చెప్పడం లేదని మండిపడ్డారు. తమ ఇంటికి ఎందుకు వచ్చారని, మా అమ్మను అరెస్ట్ చేసేందుకు వచ్చారా? అని పోలీసులను ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకంగా ఉండటం తప్పా.. అని ప్రశ్నించారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో డెక్కన్ సిమెంట్ కంపెనీ ఫైల్ విషయంలో ఓ వ్యక్తికి పాయింట్ బ్లాంక్ రేంజ్లో రివాల్వర్ పెట్టి సుమంత్ బెదిరించినట్లుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారంటూ టాస్క్ఫోర్స్ పోలీసులు చెప్పారని పేర్కొన్నారు. ఇదే విషయంలో తాము మంత్రి ఉత్తమ్ కు ఫోన్ చేస్తే.. తాను ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మా అమ్మా, నాన్నలను డీమెరిట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.

బీసీ మంత్రి పై రెడ్డి కుట్రలు

బీసీ బిడ్డ సురేఖ పై కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీసీబీసీలని రాహూల్ గాంధీ అరుస్తుంటే ఇక్కడ రెడ్లంతా కలిసి బీసీలను తొక్కుతున్నారని విమర్శించారు. రోహిన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కడియం శ్రీహరి కుట్ర ఉందంటూ ఆరోపించారు. ఇదే సమయంలో అక్కడి నుంచి మంత్రి సురేఖ, ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్‌ ఇద్దరూ ఒకే కారులో వెళ్లిపోవడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఇదిలా ఉండగా సుమంత్ ను మంత్రి ఎందుకు వెనుకేసుకొస్తోందంటూ పలువురు తమను ఎవరేం పీకలేరంటూ ప్రశ్నిస్తున్నారు. సుమంత్ అక్రమాల్లో ఆమెకు వాటా ఉందా? అనే చర్చ సాగుతోంది. రెడ్డి నాయకులతో పాటు ఈ కుట్రలో వరంగలొల్లు, సారయ్య, గుండు సుధారాణి భాగస్వాములంటూ సుస్మిత మరో సెల్ఫీ వీడియోలోతీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు, ఎంతమందోచ్చినా తమను ఏం పీకలేరంటూ పేర్కొన్నారు. కేడర్ అండగా ఉండాలని కోరారు. వివాదానికి కారణమైన సుమంత్ సురేఖ కుమార్తె సుస్మితకు క్లాస్ మెట్గా చెబుతున్నారు. ఎన్నికలకు ముందు నుంచి ఆయన వీరితో కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. సుస్మిత సూచన మేరకే సుమంత్ ను పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా తీసుకుని ఓఎస్డీగా విధులు నిర్వహించినట్లు చెబుతున్నారు. పోలీసులు మాత్రం సుమంత్ పై కేసు నమోదు చేయలేదని, విచారించేందుకు మాత్రమే వచ్చామని వివరణ ఇస్తున్నారు.

నన్ను టార్గెట్ చేస్తే వారికే నష్టం: కొండా మురళి

నేనెవరికి టార్గెట్ కాదు…నాకెవరూ టార్గెట్ లేరంటూనే నన్ను టార్గెట్ చేస్తే వారికే నష్టమని, అనేక టార్గెట్లు చూసి ఈ స్థాయికి చేరుకున్నానని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మీడియాతో చెప్పారు. నా బిడ్డకు మాట్లాడే స్వేచ్ఛ ఉందన్నారు. ఆమెకు పార్టీతో సంబంధం లేదన్నారు. తాను ఏం మాట్లాడిందో నాకు తెలియదని, నిన్న రాత్రి సుమంత్ ఎపిసోడ్ గురించి నాకు తెలియదన్నారు. తప్పెవరిదైనా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. త్వరలో పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలుస్తామన్నారు. రేవంత్ రెడ్డితో మంచి సంబంధాలున్నాయని వివరించారు.

కొండా సురేఖకు మరో షాక్

మంత్రులు పొంగులేటి, సురేఖకు మధ్య వివాదానికి కారణమైన రూ. 110 కోట్ల మేడారం జాతర పనులను ఆర్‌అండ్‌బీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మొన్న తన దగ్గర పనిచేసే ఓఎస్డీని తొలగించిన ప్రభుత్వం తాజాగా తన దేవాదాయ శాఖ పరిధిలోని మేడారం జాతర పనులు ఆర్ అండ్ బీకి అప్పగించడం షాక్ గా పేర్కొన్నారు. సంబంధిత రికార్డులు వెంటనే ఆర్ అండ్ బికి అప్పగించాలని దేవాదాయశాఖకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. వరుస పరిణామాలు,తాజా నిర్ణయాన్ని మంత్రి జీర్ణించుకోలేక పోతున్నారని సమాచారం.

కేబినేట్ సమావేశానికి హాజరవుతారా?

వరుస పరిణామాలు, షాక్ల నేపథ్యంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పై తన కుమార్తె ఆరోపణలు చేసిన నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ గురువారం మధ్యాహ్నం జరిగే కేబినేట్ మీటింగుకు హాజరవుతారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సురేఖ హైదరాబాద్ లో నే ఉన్నప్పటికీ గురువారం వరంగల్లో తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరై తిరిగి కేబినేట్ మీటింగుకు వెళుతారా? లేకుంటే గైర్హాజరవుతారా? అనే చర్చ సాగుతోంది. కొండా మురళి మాత్రం వరంగల్ సమావేశానికి సురేఖ వస్తారని చెప్పడం గమనార్హం.

కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం

కొండా సురేఖ వ్యవహారం, ఆమె కుమార్తె సీఎం రేవంత్ తో పాటు పలువురు మంత్రులు, నాయకులపై చేసిన ఆరోపణల పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. మరో వైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా సుమంత్ ను టాస్క్ ఫోర్సుకు అప్పగించకుండా సురేఖ వ్యవహరించిన తీరుపై ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే మంత్రి సురేఖ ఇంటి వద్ద భద్రత కూడా తగ్గించినట్లు ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాలు ఎటు వైపు దారితీస్తాయోననే చర్చ సాగుతోంది. ఆమె మంత్రి పదవికి ఎసరొచ్చినట్లేనని అంటున్నారు. తాజాగా జరిగిన మొత్తం పరిణామాలను మీనాక్షి కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. పీసీసీ నాయకత్వానికి కూడా గట్టిగా సూచనలు జారీ చేసినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. మంత్రుల మధ్య విభేదాల పై కూడా ఆమె అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కొండా సురేఖకు మీనాక్షి నుంచి పిలుపు వచ్చినట్లు చర్చ సాగుతోంది. కాగా, సుస్మిత చేసిన ఆరోపణలను రోహిన్ రెడ్డి కూడా ఖండించారు. సుమంత్ తన వద్దకు ఒకటి రెండు సార్లు వచ్చారని, డెక్కన్ సిమెంట్ వ్యవహారంలో తాను జోక్యం చేసుకోలేదని వివరించారు. ఈ సంఘటనలో ఫిర్యాదు దారుగా పేర్కొంటున్న మంత్రి ఉత్తమ్ కూడా తాను ఎవరిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు.