Bihar Elections 2025 | బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: రెండు విడతల్లో పోలింగ్, నవంబర్ 14న కౌంటింగ్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్, నవంబర్ 14న కౌంటింగ్ జరగనుంది.

Bihar Elections 2025 | బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: రెండు విడతల్లో పోలింగ్, నవంబర్ 14న కౌంటింగ్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది . రెండు విడతల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6, నవంబర్ 11న రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 14న కౌంటింగ్ నిర్వహిస్తారు. సోమవారం నాడు న్యూఢిల్లీలోని ఈసీఐ ప్రధాన కార్యాలయంలో భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. బిహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. బిహార్ అసెంబ్లీకి ఈ ఏడాది నవంబర్ 22 లోపుగా గడువు ముగియనుంది. ఈ గడువు లోపుగానే ఎన్నికలు నిర్వహించనుంది ఈసీఐ. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలో అధికారులతో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలో ఈసీ బృందం రెండు రోజుల పాటు చర్చించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన దిశా నిర్ధేశం చేసింది. రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది. పార్టీల సూచనలు, సలహాలు తీసుకుంది.

బిహార్ లో జేడీ(యూ), బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆర్జేడీ, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఈ సారి అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రంలో ఈసీ నిర్వహించిన ఎస్ఐఆర్ పై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి. బీజేపీకి అనుకూలంగా ఈ ఎస్ఐఆర్ ను నిర్వహించాయని ఆరోపణలు చేశాయి.ఈ ఆరోపణలను ఈసీ, బీజేపీ తోసిపుచ్చాయి. కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ఆర్జేడీ నాయకులు తేజస్వీ యాదవ్ బిహార్ లో ఓటర్ అధికార్ యాత్ర నిర్వహించారు.

బిహార్ లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 3.92 కోట్లు, మహిళలు 3.50 కోట్ల మంది ఉన్నారు. 90,712 పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లో వెబ్ క్యాస్టింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. బిహార్ లో 38 ఎస్సీలకు రెండు స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. దివ్యాంగులు, 85 ఏళ్లు దాటిన వారు ఇంటి నుంచి ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఈసీ అవకాశం కల్పించింది. రాష్ట్రంలో 14.0 1లక్ష మంది కొత్త ఓటర్లు నమోదైనట్టు సీఈసీ తెలిపారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తొలి విడత

బిహార్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల: అక్టోబర్ 10
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 10 నుంచి నామినేషన్ల స్వీకరణ
నామినేషన్ల దాఖలుకు చివరి తేది: అక్టోబర్ 17
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 18
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది:అక్టోబర్ 20
పోలింగ్ తేది: నవంబర్ 6

రెండో విడత

బిహార్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల: అక్టోబర్ 13
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 13 నుంచి
నామినేషన్ల దాఖలుకు చివరి తేది:
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 21
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది: అక్టోబర్ 23
పోలింగ్ తేది: నవంబర్ 11