A Job in Every Home Tejashwi | గెలిస్తే ఇంటికో సర్కారీ కొలువు.. బీహార్‌ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌ సంచలన ప్రకటన

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్‌ బంధన్‌ విజయం సాధిస్తే రాష్ట్రంలో ఉద్యోగస్తులు లేని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆర్జేడీ నేత, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ సంచలన ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే దీనికి సంబంధించిన చట్టాన్ని తీసుకువస్తామని చెప్పారు.

A Job in Every Home Tejashwi | బీహార్‌ ఎన్నికల ప్రచారాన్ని ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ పవర్‌ఫుల్‌ హామీతో ప్రారంభించారు. మహాఘట్‌ బంధన్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉద్యోగి లేని ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని కూటమి సమన్వయ కమిటీ చైర్మన్‌ తేజస్వి యాదవ్‌ సంచలన ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వచ్చిన 20 రోజులలోపే ఈ మేరకు చట్టం తీసుకువస్తామని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసిన అనంతరం గురువారం ఆయన మొదటిసారి పాట్నాలో మీడియా సమావేశం నిర్వహించారు. ‘పది లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని 2020లో నేను స్వయంగా రాసిచ్చాను. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ దానిని అడ్డుకున్నారు. అంత డబ్బు ఎక్కడ తెమ్మంటావు? నా అయ్య ఇంటి నుంచి తేనా? అని ప్రశ్నించారు. కానీ.. తేజస్వి యాదవ్‌ దాన్ని నిజం చేసి చూపాడు. 17 నెలల్లోనే ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించాం. మరో మూడు లక్షల ఉద్యోగాల ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ రోజు అధికార పార్టీ నిరుద్యోగ భృతి గురించే మాట్లాడుతున్నది కానీ.. ఉద్యోగాలు ఇవ్వడం లేదు’ అని తేజస్వి యాదవ్‌ అన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌పై తేజస్వి యాదవ్‌ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. 20 ఏళ్ల డబుల్‌ ఇంజిన్‌ పాలనలో హామీలన్నీ విఫలమయ్యాయని, అవినీతి పెరిగిపోయిందని, చిత్తశుద్ధి లోపించిందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు వాళ్లు చాలా హామీలు ఇచ్చారు. కానీ.. తర్వాత వాటిని గాలికొదిలేశారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను తేజస్వి టార్గెట్‌ చేశారు. ఇంటింటికీ నల్లా నీటి పథకం (నల్‌ జల్‌ యోజన) అవినీతికి నిలయంగా మారిందని ఆరోపించారు. నిరుద్యోగులపై తమ పార్టీ అజెండాను అధికార జేడీయూ సిగ్గులేకుండా కాపీ కొట్టింది కానీ.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవడం లేదని తేజస్వి యాదవ్ మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో పరిమిత స్థాయిలోనే ఉద్యోగాలు ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ ‘ఆ బాధ మిగిలే ఉంది’ అని వ్యాఖ్యానించారు.

ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం అనే హామీ.. ఏదో జనరంజక చర్య కాదని, ఉమ్మడి పాలనకు ఒక మార్గమని తేజస్వి యాదవ్‌ అభివర్ణించారు. ‘ప్రస్తుత ప్రభుత్వం యువత నిరుద్యోగులుగానే ఉండాలని కోరుకుంటున్నది. ఈ 20 ఏళ్ల పాలనలో ప్రతి ఇంటిలో భయం నెలకొల్పింది. మేం అధికారంలోకి వస్తే బీహార్‌ను ఒకటో రెండో పార్టీలు పాలించడం కాదు.. యావత్‌ రాష్ట్రం కలిసి బీహార్‌ను పరిపాలిస్తుంది’ అని చెప్పారు. తన హామీని భాగస్వామ్య ప్రజాస్వామ్యంగా అభివర్ణించారు. ‘ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ప్రభుత్వ నిర్వహణలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం వహించినట్టే’ అని తేజస్వి యాదవ్‌ చెప్పారు. తాము పాలించే ఐదేళ్లలో మా పని బీహారీ, మా మతం బీహారీ అని నిరూపిస్తామని తేల్చి చెప్పారు.

ఇవి కూడా చదవండి..

High Court Stay On BC Reservations | బీసీ రిజర్వేషన్ల జీవో 9, స్థానిక సంస్థల నోటిఫికేషన్ పై తెలంగాణ హైకోర్టు స్టే
Mukesh Ambani Tops Forbes List | ఫోర్బ్స్ సంపన్నుల జాబితా: 100 మంది కుబేరుల జాబితాలో టాప్ లో ముఖేష్ అంబానీ