Mahila Rozgar Yojana | బీహార్ మహిళల ఖాతాల్లో రూ.10వేలు
బీహార్‌లో 75 లక్షల మహిళల ఖాతాల్లో రూ.10వేలు జమ చేసిన నీతీష్ ప్రభుత్వం; మహిలా రోజ్‌గార్ యోజనపై ప్రియాంక గాంధీ విమర్శలు.

విధాత : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించింది. ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ పేరుతో రూ.10వేల చొప్పున 75లక్షల మహిళల ఖాతాల్లో డబ్బు జమ చేసింది. శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ఈ పథకాన్ని ప్రారంభించగా..ఈ కార్యక్రమంలో బీహార్ సీఎం నీతీశ్ కుమార్, ఇతర మంత్రులు హాజరయ్యారు.
మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పించడం లక్ష్యంగా రూ.7,500 కోట్లతో బీహార్‌లోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ప్రతి కుటుంబంలో ఒక మహిళకు ఈ స్కీమ్ కింద రూ.10వేలు నేరుగా అందించారు. తర్వాత వివిధ దశల్లో ఆ సహాయం రూ.2 లక్షల వరకు ఉండనుందని ప్రభుత్వం వెల్లడించింది. స్వయంఉపాధి కోసం పశుపోషణ, వ్యవసాయం, టైలరింగ్ వంటి రంగాల్లో ఆ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ పథకం ప్రారంభోత్సం సందర్భంగా సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ లాలూ ప్రసాద్ యాదవ్ సీఎం పదవిని కోల్పోయినప్పుడు.. తన సతీమణిని ముఖ్యమంత్రిని చేశారని.. తన కుటుంబం గురించి మాత్రమే ఆందోళన చెందారని విమర్శించారు. మేం మాత్రం బీహార్ ప్రజలందరి కోసం పనిచేస్తాం అని తెలిపారు.
మరోవైపు ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ పథకంపై ప్రియాంక గాంధీ స్పందించారు. ఇన్నాళ్లుగా ఇవ్వని నగదు సహాయం ఇప్పుడెందుకు ఇస్తున్నారో ప్రజలకు తెలుసని..ఇలాంటి ఓట్ల ఎత్తగడల పథకాలను మహిళలు తిప్పికొట్టి నితీష్ కుమార్ సర్కార్ కు ఎన్నికల్లో బుద్ది చెబుతారన్నారు.