Kiran Mazumdar Shaw | నా విమర్శల్లో రాజకీయ కోణంలేదు.. కర్ణాటక సీఎం, డిప్యూటీలకు బయోకాన్ చైర్‌పర్సన్ వివరణ
కొద్ది రోజులుగా బెంగళూరు మౌలిక సదుపాయాల అంశాల్లో ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్న బయోకాన్ చైర్‌పర్సర్ కిరణ్ మజుందార్ షా ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లను కలిసి, తన వ్యాఖ్యల్లో రాజకీయ ఉద్దేశాలేవీ లేవని వివరణ ఇచ్చుకున్నారు.

Kiran Mazumdar Shaw | బెంగళూరు మహానగరంలో మౌలిక సదుపాయాల దుస్థితి పై రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేయలేదని బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు స్పష్టం చేశారు. దీపావళి పండుగను పురస్కరించుకుని ఆమె సీఎం, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లను మర్యాదపూర్వకంగా కలిసి మిఠాయిలు అందచేశారు. గత కొద్ది రోజులు గా ఆమె ఎక్స్ వేదికగా మహానగరంలో రోడ్లపై గుంతలు, ట్రాఫిక్ రద్దీ, చెత్త కుప్పలపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
సీఎం సిద్ధరామయ్య ను అధికారిక నివాసం కావేరి లో ఆమె కలిసి దీపావళి అభినందనలు తెలియచేశారు. అక్కడే ఉన్న కౌన్సిల్ చైర్మన్ బసవరాజు హోరట్టికి కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత సదాశివనగర్ లో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నివాసానికి వెళ్లి కలిశారు. రోడ్ల నిర్వహణ, ట్రాఫిక్ సమస్యలపై కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీ యజమానుల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నది. మాజీ ఇన్పోసిస్ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ అదే పనిగా ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.
మనసును గాయపరిచే ఇలాంటి విమర్శలు ఆపివేయాలని, మీ అభివృద్ధి లో కూడా బెంగళూరు నగరం పాత్ర ఉందనేది మరిచిపోవద్దన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మీ మూలాలు కూడా గుర్తు పెట్టుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రజలు కాస్త ఓపిక పట్టాలని, విమర్శలకు హద్దు ఉంటుందని ఆయన అన్నారు. మోహన్ దాస్ పాయ్ వ్యక్తిగత ఎజెండాతో కాంగ్రెస్ ప్రభుత్వం పై అదే పనిగా ఎక్స్ వేదిక గా విమర్శలు చేస్తున్నారని, బీజేపీ హయాంలో రోడ్లు దెబ్బతిన్నా, ట్రాఫిక్ సమస్యలు ఉన్నా ఒక్కరోజు కూడా విమర్శలు చేయలేదని శివ కుమార్ బదులిచ్చిన విషయం విదితమే.