పాక్ బ‌రితెగింపు.. భార‌త ఔట్‌పోస్టుల‌పై రేంజ‌ర్ల కాల్పులు

పాక్ బ‌రితెగింపు.. భార‌త ఔట్‌పోస్టుల‌పై రేంజ‌ర్ల కాల్పులు
  • కాల్పుల్లో బీఎస్ఎఫ్ జ‌వాన్‌కు గాయాలు
  • 24 రోజుల్లో ఇది మూడోసారి కాల్పులు


విధాత‌: పాకిస్థాన్ మ‌రోసారి బ‌రితెగించింది. కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ములోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సరిహద్దు అవుట్‌పోస్టులపై కాల్పుల‌కు తెగ‌బ‌డింది. ఈ కాల్పుల్లో స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళానికి (బీఎస్ఎఫ్‌) చెందిన‌ జ‌వాన్‌ గాయపడ్డారు. బుధ‌వారం అర్థరాత్రి దాటాక రామ్‌గఢ్-అర్నియా సెక్టార్లలో పాకిస్తాన్ రేంజర్లు అకారణంగా కాల్పులు జరిపారు.


”రామ్‌గ‌ఢ్‌లో సరిహద్దు కాల్పుల్లో 28 ఏండ్ల‌ బీఎస్ఎఫ్ జ‌వాన్ గాయపడ్డారు. అత‌డిని రాత్రి ఒంటిగంటకు ఇక్కడకు తీసుకొచ్చారు. మా బృందం ద‌వాఖాన‌లో తగిన చికిత్స అందించారు. ఘటన గురించి మాకు అధికారులు ముందస్తు సమాచారం ఇచ్చినందున మేము అప్ర‌మ‌త్తంగా ఉండి చికిత్స అందించాం”అని సాంబా జిల్లాలో బ్లాక్ మెడికల్ ఆఫీసర్‌ డాక్ట‌ర్ లఖ్వీందర్ సింగ్ తెలిపారు.


గ‌డిచిన 24 రోజుల్లో పాక్ కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించ‌డం ఇది మూడోవ‌సారి. అక్టోబర్ 28న పాకిస్తాన్ రేంజర్లు సుమారు ఏడు గంటలపాటు భారీ కాల్పులు, షెల్లింగ్ జ‌రిపారు. దాంతో ఇద్దరు బీఎస్ఎఫ్‌ జవాన్లు, ఒక మహిళ గాయపడ్డారు.


అక్టోబర్ 17న అర్నియా సెక్టార్‌లో పాకిస్థాన్ రేంజర్లు అనూహ్యంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు బీఎస్ఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. తాజాగా బుధ‌వారం రాత్రి మ‌రోసారి కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. 2021 ఫిబ్రవరి 25న భార‌త్‌-పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేశాయి. నాటి నుంచి పాక్ ఒప్పందాన్ని ఉల్లంఘించ‌డం ఇది ఆరోసారి.