Ranya Rao : రన్యారావు పెళ్లికి వచ్చిందెవరు.. ఇచ్చిన గిఫ్టులేంటి? వెడ్డింగ్ వీడియోలపై సీబీ‘ఐ’
స్మగ్లింగ్ ఆపరేషన్‌లో హై ప్రొఫైల్ వ్యక్తుల వివరాలపై సీబీఐ అధికారులు నిఘా పెట్టిన నేపథ్యంలో ఈ కేసు రన్యారావు మాత్రమే కాకుండా మరింత మందిని టార్గెట్ చేసే అవకాశం ఉన్నదని అంటున్నారు.

Ranya Rao : బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ దొరికిపోయిన కన్నడ సినీ నటి, కర్ణాటక డీజీపీ సవతి కుమార్తె రన్యారావుకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? అనే జాబితాను బయటకు తీసే పనిపై సీబీఐ అధికారులు ఫోకస్ పెట్టారు. ఆమె వెనుక పెద్ద స్మగ్లింగ్ రాకెట్ ఉన్నదనే అనుమానంతో ఆమె పెళ్లి వీడియోలను వెతుకుతున్నారు. ఈ వీడియోలను జల్లెడ పడితే ఆమె వివాహానికి వచ్చినవారెవరు? ఆమెకు ఇచ్చిన గిఫ్ట్‌లేంటి? అనేది తెలుస్తుందని, వాటి ద్వారా కూపీ లాగితే ఆమె స్మగ్లింగ్ దందాలో ఉన్నదెవరో తెలిసే అవకాశం ఉన్నదని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఆమెకు ఉన్న పరపతి రీత్యా హై ప్రొఫైల్ సంబంధాలే ఉండే అవకాశం ఉన్నదని పేర్కొంటున్నాయి.
ఈ క్రమంలోనే రన్యా నివాసం, కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (KIADB) కార్యాలయం, ఆమె వివాహం జరిగిన హోటల్‌లో సోదాలు నిర్వహించారు. ఆమె వివాహ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా గమనిస్తున్నామని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఆమెకు ఖరీదైన బహుమతులు ఎవరు ఇచ్చారనే వివరాలు సేకరిస్తున్నామని తెలిపాయి. ఖరీదైన గిఫ్టులు ఇచ్చినవారిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నారు. దీనితో స్మగ్లింగ్ కేసులో మరిన్ని వివరాలు బయటకు వస్తాయనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. స్మగ్లింగ్ ఆపరేషన్‌లో హై ప్రొఫైల్ వ్యక్తుల వివరాలపై సీబీఐ అధికారులు నిఘా పెట్టిన నేపథ్యంలో ఈ కేసు రన్యారావు మాత్రమే కాకుండా మరింత మందిని టార్గెట్ చేసే అవకాశం ఉన్నదని అంటున్నారు. ఈ కేసును సీబీఐ ఢిల్లీ బృందం లోతుగా పరిశీలిస్తున్నది. కేఐఏడీబీ ఇచ్చిన భూమి అనుమతులపైనా అధికారులు దృష్టిసారించారు.