నీట్ పేపర్ లీక్ సందర్భంగా విద్యార్ధులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ పోస్టు చేసిన వీడియోను తమ ప్లాట్‌ఫామ్ నుండి తొలగించిన వ్యవహారంలో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ పామ్స్ (పేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్) మాతృ సంస్థ మెటాపై ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం తీవ్రంగా స్పందించింది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మూడు రోజుల్లోగా భేషరతుగా క్షమాపణలు చెప్పాలని, బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అల్టిమేటం జారీ చేసింది.
ఒకవేళ క్షమాపణ చెప్పకుంటే సేఫ్ హార్బర్ రక్షణ రద్దు చేస్తామని, కేసు నమోదు అవుతుందని హెచ్చరించింది. 140 కోట్లమంది భారతీయులకు ప్రతినిధి అయిన ప్రధాని మోదీ షేర్ చేసిన వీడియోను తొలగించడం ‘ప్రజాస్వామ్యంపై దాడి’ లాంటిదేనని ప్యానెల్ పేర్కొంది. భారత్ చట్టాలను మెటా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
నీట్ ప్రశ్నాపత్రం పేపర్ లీకేజీపై విద్యార్ధుల నిరసనల వేళ ప్రధాని మోడీ ‘జెన్ జీ’ యువతను ఉద్దేశించి మాట్లాడిన వీడియోను జులై 23న ఫేస్‌బుక్ దాదాపు 5 గంటల పాటు నిలిపివేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్ర ఐటీ శాఖ ఉన్నతాధికారులతో మెటా గ్లోబల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. మెటా గ్లోబల్ అఫైర్స్ చీఫ్ జోయెల్ కాప్లాన్ నేతృత్వంలోని బృందం మాట్లాడుతూ ప్రధాని వీడియో తొలగింపు సాంకేతిక లోపం వల్ల మాత్రమే జరిగిందని, ప్లాట్‌ఫామ్‌ను కావాలని దుర్వినియోగం చేయలేదని వెల్లడించారు. ఆ తర్వాతా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో మెటా గ్లోబల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. రేపు కూడా ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి కమిటీతో వారు భేటీ కానున్నారు.
జుకర్ బర్గ్ క్షమాపణలు..
ప్రధాని మోదీ వీడియో తొలగింపుపై కేంద్రం అల్టిమేటమ్ నేపథ్యంంలో మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కీలక ప్రకటన చేశారు. ప్లాట్ ఫారమ్ నిర్వహణలో జరిగిన పొరపాట్లపైన జుకర్ బర్గ్ విచారం వ్యక్తం చేశారు. ప్లాట్‌ఫామ్‌లలో చిన్నారులపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన అసభ్యకర కంటెంట్, డీప్ కంటెంట్ లపై జుకర్ బర్గ్ భారత ప్రభుత్వానికి క్షమాపణ తెలిపారు. హానికర కంటెంట్ అరికట్టెందుకు మరింత కఠిన చర్యలు తీసుకుంటామని, వినియోగదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, ప్లాట్ ఫారమ్ విశ్వసనీయతను మరింత బలోపేతం చేస్తాం అని తెలిపారు. అయితే ప్రధాని మోదీ వీడియో తొలగింపు అంశాన్ని మాత్రం జుకర్ బర్గ్ తన ప్రకటనలో ప్రస్తావించకపోవడం గమనార్హం.
