Lok Sabha | ఆరు దశాబ్దాల్లో చైనా ఆక్రమించిన భారత భూభాగం ఎంతో తెలుసా?

Lok Sabha | ఆరు దశాబ్దాల్లో చైనా ఆక్రమించిన భారత భూభాగం ఎంతో తెలుసా?

Lok Sabha | చైనా గ‌త ఆరు ద‌శాబ్దాల్లో 38,000 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల భార‌త భూభాగాన్ని అక్ర‌మంగా ఆక్ర‌మించింద‌ని కేంద్ర విదేశాంగ‌శాఖ స‌హాయ‌మంత్రి వి. ముర‌ళీధ‌ర‌న్ శుక్ర‌వారం లోక్‌స‌భ‌లో చెప్పారు. అంతేగాక పాకిస్తాన్ త‌న ఆక్ర‌మ‌ణ‌లో ఉన్న 5180 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల శ‌క్‌గాం వ్యాలీని 1963లో చైనాకు స్వాధీనం చేసింద‌ని కూడా ఆయ‌న చెప్పారు. చైనా పాకిస్తాన్ స‌రిహ‌ద్దు ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ శ‌క్‌గాం వ్యాలీని చైనాకు అప్ప‌గించింద‌ని, ఈ ఒప్పందాన్ని భార‌త్ అంగీక‌రించ‌లేద‌ని ఆయ‌న ఒక లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో తెలిపారు. జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌లలోని భూభాగం భార‌త్‌లో విడ‌దీయ‌లేని భాగ‌మ‌ని రెండు దేశాల‌కు భార‌త్ ఎప్ప‌టిక‌ప్పుడు స్ప‌ష్టం చేస్తూ వ‌స్తున్న‌ద‌ని ముర‌ళీధ‌ర‌న్ చెప్పారు. చైనా పాంగాంగ్ స‌ర‌స్సుపై ఒక వంతెన నిర్మిస్తున్న విష‌యం తమ దృష్టిలో ఉంద‌ని ఆయ‌న మ‌రో ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు. 1962 నుంచి చైనా ఆక్ర‌మ‌ణ‌లో ఉన్న ప్రాంతంలోనే వంతెన నిర్మిస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. చైనాతో దౌత్య‌ప‌రంగాను, సైనిక ప‌రంగానూ చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయ‌ని ఆయన తెలిపారు.