Champai Soren । బీజేపీలో చేరడంపై చంపై సోరెన్ క్లారిటీ!
తాను బీజేపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలను జార్ఖండ్ ముక్తి మోర్చా నేత, జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ (Champai Soren) ఖండించారు. తన వ్యక్తిగత పనులపైనే (personal work) ఢిల్లీకి వచ్చానని తెలిపారు

Champai Soren । తాను బీజేపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలను జార్ఖండ్ ముక్తి మోర్చా నేత, జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ (Champai Soren) ఖండించారు. తన వ్యక్తిగత పనులపైనే (personal work) ఢిల్లీకి వచ్చానని తెలిపారు. సోరెన్‌తోపాటు ఆరుగురు జేఎంఎం (Jharkhand Mukti Morcha) ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ వచ్చారు. ఢిల్లీలో ల్యాండ్ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు ఎవరినీ తాను కలుసుకో లేదని, వ్యక్తిగత పనులపైనే వచ్చానని చెప్పుకొన్నారు. కోల్‌కతాలో పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారితో (Suvendu Adhikari) సమావేశమైనట్టు వచ్చిన వార్తలను కూడా ఆయన ఖండించారు. ‘నేను ఎవరినీ కలవలేదు’ అని చెప్పారు.
జార్ఖండ్ అసెంబ్లీకి (Jharkhand assembly) త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరుతారని మీడియాలో వార్తలు గుప్పమన్నాయి. హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలైన తర్వాత తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి, మళ్లీ హేమంత్ సోరెన్ సీఎం కావడంపై చంపై సోరెన్ మనస్తాపంతో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఒక భూమికి సంబంధించిన మనీ లాండరింగ్ (money laundering) కేసులో హేమంత్ సోరెన్ (Hemant Soren) అరెస్టు కావడానికి ముందు సీఎం పదవికి రాజీనామా చేసి, ఆ స్థానంలో చంపైను కూర్చొనబెట్టిన విషయం తెలిసిందే. అయితే తదుపరి హేమంత్‌కు బెయిల్ రావడంతో చంపైను తప్పించి.. మళ్లీ సీఎం అయ్యారు.
ఇదిలా ఉంటే.. చంపై సోరెన్ బీజేపీలో చేరుతారని వస్తున్న వార్తలను జార్ఖండ్ ఇన్‌చార్జ్, అసోం సీఎం హేమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) ఖండించారు. తనతో లేదా తన పార్టీ నేతలతో సోరెన్ ఎలాంటి సంప్రదింపులు జరుపలేదని ఆయన స్పష్టం చేశారు.