Jharkhand Elections | జార్ఖండ్‌లో రెండు దశల్లో ఎన్నికలు.. నవంబర్ 13, 20 పోలింగ్
జార్ఖండ్ అసెంబ్లీ( Jharkhand Assembly ) కి ఎన్నికల నగారా మోగింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను( Jharkhand assembly Elections ) రెండు దశల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.

Jharkhand Elections | న్యూఢిల్లీ : జార్ఖండ్ అసెంబ్లీ( Jharkhand Assembly ) కి ఎన్నికల నగారా మోగింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను( Jharkhand assembly Elections ) రెండు దశల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో జార్ఖండ్‌లో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
జార్ఖండ్‌లో 24 జిల్లాల్లో 81 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 44 స్థానాలు జనరల్ కాగా, ఎస్టీ 28, ఎస్సీ 9 చొప్పున ఉన్నాయి. మొత్తంగా 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లు 1.29 కోట్లు, పురుష ఓటర్లు 1.31 కోట్లు ఉన్నారు. 66.84 లక్షల మంది యువ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 11.84 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జార్ఖండ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన గడువు ముగియనుంది.
జార్ఖండ్‌లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 13న తొలి విడుత, 20న రెండో విడుత ఎన్నికలు నిర్వహించి, నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
జార్ఖండ్ తొలి విడుత ఎన్నికలకు అక్టోబర్ 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 28న స్క్రూట్నీ నిర్వహించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 30. నవంబర్ 13న పోలింగ్ నిర్వహించనున్నారు.
రెండో విడత ఎన్నికలకు అక్టోబర్ 22న నోటిఫికేషన్ విడుదల కానుంది. 29వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 30న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 1. నవంబర్ 20న పోలింగ్ నిర్వహించనున్నారు. తొలి, రెండో దశ ఎన్నికల కౌంటింగ్ నవంబర్ 23న చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.