EVMs | ఈవీఎంలపై పునరాలోచించాలి: కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ వినతి

EVMs | ఈవీఎంల పనితీరుపై అనుమానాలున్నాయని.. వీటి వినియోగంపై పునరాలోచించాలని వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. రానున్న ఎన్నికలు బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని వైసీపీ బృందం ఈసీని కోరింది. గురువారం వైసీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి, లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన్న చంద్రశేఖర్, పార్టీ నేత లోకేష్ రెడ్డిల బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఏపీలో ఈవీఎంల పనితీరుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల చివరి గంటల్లో అకస్మాత్తుగా పోలింగ్ శాతం పెరగడం, అసాధారణంగా ఓటర్లు పెరగడం తదితర అంశాలను ఈసీ దృష్టికి వైసీపీ బృందం తీసుకెళ్లింది.
అనంతర ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గతంలో ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి చేసిన ఫిర్యాదులపై వివరణకు కేంద్ర ఎన్నికల సంఘం తమను ఆహ్వానించిందన్నారు. ఈవీఎంలపై ఉన్న టెక్నికల్ అనుమానాలపై ఈసీకి వివరించాం. వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని.. కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల ఓట్లకు, వీవీప్యాట్లను పోల్చి చూడాలని కోరినట్లు తెలిపారు. బీహార్ తరహాలో ఏపీలో కూడా స్పెషల్ ఇంటెన్సిఫై రివిజన్ చేయాలని కోరామని దీనికి ఈసీ ఒప్పుకుందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ విధానం అమల్లో ఉందని.. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు జరగాలి అని ఈసీని కోరినట్లు వెల్లడించారు.