CM Arvind Kejriwal | ఉగ్రవాద ప్రాయోజకుల జోక్యాన్ని భారత్ సహించదు
ప్రస్తతం దేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు భారత అంతర్గత వ్యవహారమని, తన సమస్యలను పరిష్కరించుకునే శక్తి భారతదేశానికి ఉన్నదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

పాకిస్థాన్ నేతకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కౌంటర్
న్యూఢిల్లీ: ప్రస్తతం దేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు భారత అంతర్గత వ్యవహారమని, తన సమస్యలను పరిష్కరించుకునే శక్తి భారతదేశానికి ఉన్నదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో శనివారం తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సందర్భంగా కేజ్రీవాల్ ఒక ట్వీట్ చేశారు. దానికి పాకిస్థాన్ నేత ఫావద్ హుస్సేన్ స్పందించడంపై ఆయన ఈ మేరకు కౌంటర్ ఇచ్చారు. ఓటేసిన అనంతరం దిగిన తమ కుటుంబ సభ్యుల ఫొటోను ఎక్స్‌లో పోస్ట్ చేసిన కేజ్రీవాల్.. నా తండ్రి, భార్య, పిల్లలతో కలిసి నేను ఇవాళ ఓటేశాను. నా తల్లికి ఆరోగ్యం బాగోలేదు. ఆమె ఓటేయడానికి వెళ్లలేకపోయారు. నేను నియంతృత్వానికి, నిరుద్యోగితకు, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఓటు వేశాను. మీరు కూడా వెళ్లి ఓటేయండి’ అని పేర్కొన్నారు.
దీనికి ఫావద్ హుస్సేన్ స్పందిస్తూ.. ‘విద్వేష, ఉగ్రవాద శక్తులను శాంతి, సామరస్యం ఓడించుగాక’ అని కామెంట్ చేశారు. వెంటనే దీనికి రిటార్టిచ్చిన కేజ్రీవాల్.. ‘చౌదరి సాహెబ్.. నేను నా దేశ ప్రజలు మా సమస్యలను పరిష్కరించుకోగల సామర్థ్యం కలిగి ఉన్నాం. మీ ట్వీట్ అవసరం లేదు. ప్రస్తతం పాకిస్థాన్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. మీ దేశం గురించి మీరు శ్రద్ధ పెట్టండి’ అని బదులిచ్చారు. ఎన్నికలు ఇండియాలో జరుగుతున్నాయి. అది మా అంతర్గత వ్యవహారం. ఉగ్రవాదానికి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చే శక్తుల జోక్యాన్ని భారత్ సహించదు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ఆరో దశలో భాగంగా ఢిల్లీలోని మొత్తం ఏడు సీట్లు, హర్యానాలోని మొత్తం 10 సీట్లు సహా దేశవ్యాప్తంగా 58 స్థానాల్లో శనివారం ఉదయం నుంచి పోలింగ్ జరుగుతున్నది.