క‌లెక్ట‌ర్ కారు ఢీకొని ముగ్గురి మృతి.. బిహార్‌లో ఘ‌ట‌న‌

అతి వేగంతో వెళుతున్న క‌లెక్ట‌ర్ వాహ‌నం ఢీకొని ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. బిహార్‌లోని జాతీయ ర‌హ‌దారి 57పై మంగ‌ళ‌వారం ఉద‌యం 8 గంట‌ల‌కు ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

క‌లెక్ట‌ర్ కారు ఢీకొని ముగ్గురి మృతి.. బిహార్‌లో ఘ‌ట‌న‌

విధాత‌: అతి వేగంతో వెళుతున్న క‌లెక్ట‌ర్ వాహ‌నం ఢీకొని ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. బిహార్‌లోని జాతీయ ర‌హ‌దారి 57పై మంగ‌ళ‌వారం ఉద‌యం 8 గంట‌ల‌కు ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆ కారు మ‌ధేపుర జిల్లా క‌లెక్ట‌ర్‌కు చెందిన వాహ‌నంగా గుర్తించారు. అయితే ప్ర‌మాద స‌మ‌యంలోఆ అధికారి అందులో ఉన్నారా లేదా అనే అంశంపై అధికారులు గోప్య‌త పాటిస్తున్నారు.


ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే కారులో ఉన్న‌వారంతా పారిపోయార‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్నారు. ఈ దుర్ఘ‌ట‌న ప‌ట్ల స్థానికులు ఆగ్ర‌హావేశాల‌కు లోన‌య్యారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే జాతీయ ర‌హ‌దారిపై బైఠాయించి వాహ‌నాల రాక‌పోక‌ల‌ను నిలిపివేశారు. కారు అతి వేగంతో ప్ర‌యాణించ‌డ‌మే ఈ ప‌రిస్థితికి కార‌ణ‌మ‌ని ప్ర‌త్య‌క్ష‌సాక్షులు చెబుతున్నారు. రోడ్డు దాటుతున్న వారిని చూసి డ్రైవ‌ర్ బ్రేకు వేసిన‌ప్ప‌టికీ.. కారు వారిని ఢీకొని డివైడ‌ర్ మీద‌కు వెళ్లిపోయింద‌ని పేర్కొన్నారు.


ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా మ‌రో ఇద్ద‌రు తీవ్ర గాయాల‌తో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల‌ను జాతీయ ర‌హ‌దారి ప‌నులు చేయ‌డానికి రాజ‌స్థాన్ నుంచి వ‌చ్చిన కార్మికులుగా గుర్తించారు. ఘ‌ట‌న‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశామ‌ని.. ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన‌ది ఎవ‌రైనా చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఎస్పీ సుశీల్ కుమార్ వెల్ల‌డించారు.