సినిమా త‌ర‌హా యాక్సిడెంట్‌.. బ్రిడ్జిపై నుంచి క‌దిలే గూడ్స్‌పై ప‌డిన కారు

  • By: Somu    crime    Nov 08, 2023 6:57 AM IST
సినిమా త‌ర‌హా యాక్సిడెంట్‌.. బ్రిడ్జిపై నుంచి క‌దిలే గూడ్స్‌పై ప‌డిన కారు
  • ఆర్‌పీఐ కార్యకర్తసహా ముగ్గురు దుర్మ‌ర‌ణం
  • ముంబై-పన్వేల్ రహదారిపై రాత్రివేళ ఘ‌ట‌న‌



విధాత‌: మహారాష్ట్రలో హాలీవుడ్ సినిమా త‌ర‌హాలో కారు యాక్సిడెంట్ జ‌రిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుత‌ప్పి వంతెన‌పై నుంచి క‌దులుతున్న గూడ్స్ రైలుపై ప‌డిపోయింది. ఈ ప్ర‌మాదంలో స్థానిక రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ) కార్య‌క‌ర్త‌తోసహా ముగ్గురు మరణించారు. మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ముంబై-పన్వేల్ రహదారిపై మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున చోటుచేసుకున్న‌ది. ఈ ప్ర‌మాదంపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే విచారణ జరిపించాలని కోరారు.


పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. ముంబై-పన్వేల్ రహదారిపై నేరల్ వైపు వెళ్తున్న ఐదుగురు ప్ర‌యాణిస్తున్న కారు.. కినావలి సమీపంలోని వంతెనపై అదుపుత‌ప్పి క‌దులుతున్నగూడ్స్ రైలుపై ప‌డిపోయింది. రాయ్‌గఢ్ జిల్లాలోని పన్వెల్ నుంచి కర్జాత్‌కు వెళ్తున్న గూడ్స్ రైలుపై కారు వేగంగా ప‌డిపోవ‌డంతో కొన్ని వ్యాగన్లు విడిపోయాయి.


ఈ ప్రమాదం కారణంగా సెంట్ర‌ల్ రైల్వేలోని పన్వెల్-కర్జాత్ సెక్షన్‌ను తెల్లవారుజామున 3.43 నుంచి ఉదయం 7.32 గంటల వరకు మూసివేశారు. ఒక రైలును దారి మ‌ళ్లించారు. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు చ‌నిపోయారు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.