బీజేపీ ఓటమిపై కాంగ్రెస్‌లో ఎందుకంత ధీమా?
నరేంద్రమోదీ మూడోసారి ప్రధాన మంత్రి కాబోవడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ఎన్నికల ప్రచార సభల్లో పదే పదే ప్రస్తావిస్తున్నారు

మోదీ దిగిపోయే ప్రధాని అంటున్న రాహుల్
115 సీట్లలో గెలుపుపై కాంగ్రెస్ విశ్వాసం
కూటమికి 250 సీట్ల వరకు వస్తాయని అంచనా
తటస్థ పార్టీలు ఇండియాకు మొగ్గుచూపుతాయి
ఎన్డీయే పక్షాలూ మాకు దగ్గరవుతాయి
క్షేత్రస్థాయి గణాంకాలతో నేతల కసరత్తు
న్యూఢిల్లీ : నరేంద్రమోదీ మూడోసారి ప్రధాన మంత్రి కాబోవడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ఎన్నికల ప్రచార సభల్లో పదే పదే ప్రస్తావిస్తున్నారు. అందరికీ అది ఒక ఎన్నికల ప్రచార ఎత్తుగడగా కనిపించవచ్చు. అయితే.. ఎన్డీయే ఈసారి 272 మార్కును దాటే అవకాశాలు లేవని కాంగ్రెస్ బలంగా విశ్వసిస్తున్నది. కొన్న చోట్ల కొత్తగా బీజేపీ విజయాలు సాధించినప్పటికీ.. అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీ గణనీయంగా సీట్లను కోల్పోబోతున్నదనేది రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.
ప్రత్యేకించి మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, హర్యానాలో బీజేపీ, దాని మిత్రపక్షాల సీట్లకు భారీగా గండిపడుతుందని అంచనా వేస్తున్నారు. ఢిల్లీ, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, అసోంలో సైతం ఎన్డీయే సీట్లు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణలో, ఒడిశాలో బీజేపీ ఎంత మేరకు సీట్లు సాధిస్తుందనేది అనుమానమే. తమిళనాడు, కర్ణాటకలో మాత్రం కాంగ్రెస్‌కు తిరుగులేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ‘బెంగాల్‌లో బీజేపీ పుంజుకుంటుందని మేం భావించడం లేదు. 2019లో వాళ్లు 18 సీట్లలో గెలిచారు. ఈసారి 14 నుంచి 15 సీట్లకు పరిమితం కావచ్చని మాకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది.
ఒడిశాలో ఒకటి లేదా రెండు సీట్లు గెలుస్తారేమో. బీజేడీ, బీజేపీ మధ్య ఒక విధంగా యుద్ధమే సాగుతున్నది. ఈసారి నవీన్ పట్నాయక్.. మోదీకి ఆయన స్థానమేంటో చూపిస్తారు’ అని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అన్నారు. బీజేపీ కొత్తగా దేశవ్యాప్తంగా ఐదారు సీట్లలో గెలుస్తుందని, కానీ.. 60 నుంచి 70కి పైగా స్థానాల్లో ఓడిపోబోతున్నదని అన్నారు. ‘అందుకే మోదీ మూడోసారి ప్రధాని కాబోవడం లేదని రాహుల్‌గాంధీ, మా పార్టీ అధినే ఖర్గే చెబుతున్నారు. వాస్తవానికి బీజేపీ గ్రాఫ్ దిగజారిపోతున్నది. చివరి దశ పోలింగ్ ముగిసే నాటికి బీజేపీ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది’ అని ఆయన అంచనా వేశారు.
బీహార్, కర్ణాటక, హర్యానాల్లో బీజేపీ భారీగా సీట్లు కోల్పోతుందని అర్థమవుతున్నదని మరో సీనియర్ నేత చెప్పారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఓటరు తీర్పు నాటకీయంగా మారిపోనున్నదని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారని తమకు క్షేత్రస్థాయి నివేదికలు అందుతున్నాయని చెప్పారు. మోదీ హామీలు, రాజకీయాలపై మహారాష్ట్రలో ప్రజలను అనేక స్వచ్ఛంద సంస్థలు, పౌర సంస్థలు చైతన్యం చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కొన్ని ప్రాంతాల్లో మోదీ వ్యతిరేకత ఉన్నదని ఆయన అన్నారు.
మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రెపట్ల సానుభూతి, ఇద్దరు గుజరాతీ నాయకులైన మోదీ, అమిత్‌షాల మహారాష్ట్ర వ్యతిరేక వైఖరి, కాంగ్రెస్, పవార్, ఉద్ధవ్ పార్టీల ఉమ్మడి బలం అనే అంశాలు బీజేపీకి ఇబ్బందికరంగా పరిణమిస్తాయని చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 48 సీట్లు నిట్టనిలువునా చీలిపోతాయని బీజేపీ నాయకులు సైతం అంగీకరిస్తున్నారని ఆయన అన్నారు. మహా వికాస్ అఘాడీకి ఈసారి 30కిపైగా సీట్లు వస్తాయని స్థానిక నేతలు చెబుతున్నారని తెలిపారు. గత ఎన్నికల్లో ఎన్డీయేకు 42 సీట్లు వచ్చాయి. అంటే.. ఈసారి ఎన్డీయేకే కాకుండా.. బీజేపీకి సైతం గట్టి ఎదురుదెబ్బ మహారాష్ట్ర రూపంలో ఎదురుకానున్నదని అంటున్నారు.
యూపీపైనా కాంగ్రెస్‌లో గట్టి విశ్వాసం కనిపిస్తున్నది. మొత్తం 80 సీట్లలో బీజేపీ 70 సీట్లు గెలుచుకోకుండా అడ్డుకోవాలని తాము భావించామని సీనియర్ నేత ఒకరు చెప్పారు. అయితే.. ఇండియా కూటమిలో మాయావతి చేరకపోవడం ఒక ఇబ్బందికర అంశమని అన్నారు. అయితే.. ధరల పెరుగదల, నిరుద్యోగం, అగ్నివీర్ అంశాలు రామ మందిరం అంశాన్ని బీట్ చేశాయని చెప్పారు. బీజేపీకి 400 సీట్లు దాటితే రాజ్యాంగాన్ని మార్చివేస్తారన్న అంశం దళిత, బడుగు వర్గాల్లోకి బలంగా వెళ్లిందని అన్నారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను ఎన్నికల బరి నుంచి తప్పించడంతో బీజేపీకి వ్యతిరేకంగా బీఎస్పీ పోరాడబోదన్న అంశం ప్రజలకు స్పష్టమైందని ఆయన చెప్పారు.
దళితులు, యువత నుంచి తమ పార్టీకి గట్టి మద్దతు లభిస్తున్నదని సీనియర్ నేత చెప్పారు. అగ్నివీర్ పథకం, జాట్‌లు, రాజ్‌పుత్‌ల ఆందోళన రాజస్థాన్‌లో తమకు సహకరిస్తాయని అన్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఆరు నుంచి పది సీట్లను గెలుచుకునే అవకాశం ఉన్నదని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయని అన్నారు. అక్కడ ఇండియా కూటమికి 40 సీట్లు వస్తాయని చెబుతున్నా.. కనీసంగా 30 ఖాయమని చెప్పారు. రామ మందిరం పేరుతో బీజేపీ చేసిన హడావుడి నేపథ్యంలో ఆ పార్టీని 50 సీట్లకు పరిమితం చేయడం అనేది గొప్ప విషయమే అవుతుందని అన్నారు. గుజరాత్‌లో మాత్రం కనీసం మూడు సీట్లలో తాము విజయం సాధిస్తామని చెప్పారు. గట్టిపోటీలో మరో రెండు సీట్లు కూడా చేజక్కించుకునే అవకాశం ఉన్నదని తెలిపారు. గుజరాత్‌లోనే బీజేపీ ఐదు సీట్లు కోల్పోయిందంటే.. దేశవ్యాప్తంగా మరిన్ని తగ్గుతాయని విశ్లేషించారు.
కాంగ్రెస్ తనంతట తానుగా 115 సీట్లు గెలుస్తుందని, ఇండియా కూటమిలోని ఇతర పక్షాలు 170కి పైగా సీట్లు సాధించే అవకాశం ఉన్నదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ పరిస్థితుల్లో ఇప్పటి వరకూ తటస్తంగా ఉన్న పార్టీలు తమ వెంట వచ్చే అవకాశం ఉన్నదని, ఎన్డీయేలోని కొన్ని పక్షాలు సైతం తమకు మద్దతుగా నిలుస్తాయని అంటున్నాయి. మోదీ దిగిపోయే ప్రధాని అని ఇప్పటికే కాంగ్రెస్ అధికార ప్రతినిధులు చెబుతున్నారు. మోదీలో అసహనం, విశ్వాసం కొరవడటం ఆయన వాడుతున్న భాషతో తేలిపోతున్నదని, బీజేపీ ఓడిపోతున్నదనేందుకు మోదీ ప్రవర్తిస్తున్న తీరే ఉదాహరణ అని కాంగ్రెస్ నాయకులు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.