Dhan Dhaanya Krishi Yojana | ‘పీఎం ధన్ ధాన్య కృషి’ యోజనకు ఆమోదం

- శుభాంశు శుక్లాను అభినందిస్తూ తీర్మానం
- కేంద్ర క్యాబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు
Dhan Dhaanya Krishi Yojana | రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో స్కీమ్ ను తీసుకువచ్చింది. ఈ మేరకు కేంద్ర క్యాబినేట్ లో ‘పీఎం ధన్ ధాన్య కృషి’ యోజనకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి (Dhan Dhaanya Krishi) యోజన ద్వారా దేశ వ్యాప్తంగా 1.70 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గం సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రి వర్గం వాటికి ఆమోద ముద్ర వేసింది. వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేయడంలో భాగం పీఎం ధన్ ధాన్య కృషి యోజన (PM Dhan Dhaanya Krishi Yojana) పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో పాటు పలు నిర్ణయాలను కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. క్యాబినేట్ మీటింగ్ అనంతరం మండలిలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. పీఎం ధన్ ధాన్య కృషి యోజన స్కీమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు.
ఈ కొత్త స్కీమ్ లో భాగంగా దేశ వ్యాప్తంగా 100 వ్యవసాయ ఆధారిత జిల్లాలను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా 1.70కోట్ల మంది అన్నదాతలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా దేశంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, పంట వైవిధ్యతను ప్రోత్సహించడం, పంట కోత తర్వాత నిల్వలను బలోపేతం చేయడం, రైతులకు స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు పెంచడంతో పాటు ఇరిగేషన్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లాంటి లక్ష్యాలు ప్రధానంగా ఉన్నాయన్నారు. అలాగే, ఎన్టీపీసీకి రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకుని ఇటీవల భూమికి తిరిగి వచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు క్యాబినెట్ అభినందించింది. ఈ మేరకు శక్లాను అభినందిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.