తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమికే విజయావకాశాలు : పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌పోల్‌

తమిళనాడులో డీఎంకే మరోసారి అధికారంలోకి రాబోతున్నదని పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొంటున్నాయి.

  • By: TAAZ |    national |    Published on : Apr 29, 2026 6:48 PM IST
తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమికే విజయావకాశాలు : పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌పోల్‌

తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని లౌకిక ప్రగతి కూటమి (ఇండియా బ్లాక్‌) ఘన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని పీపుల్స్‌ పల్స్‌ సర్వే పేర్కొన్నది. కూటమికి మెజార్టీ మార్కుకు మించి.. 125 నుంచి 145 మధ్య సీట్లు సాధించి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపింది. రెండో స్థానంలో అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమి నిలుస్తుందని పేర్కొంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును విజయ్‌కు చెందిన టీవీకే గణనీయంగా చీల్చే అవకాశాలు ఉన్నట్టు ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొంటున్నాయి. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 65 నుంచి 80 మధ్య సీట్లు లభించే అవకాశం ఉన్నట్టు తెలిపింది. హీరో విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) 18 నుంచి 24 సీట్లు గెల్చుకోవచ్చని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. ఇతరులు 2 నుంచి 6 సీట్లు గెలుస్తారని పేర్కొంది.
గతంతో పోల్చితే ఈ ఎన్నికల్లో ఓటింగ్‌ 84శాతం నమోదైంది. 2011 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఇది 11 శాతం ఎక్కువ. డీఎంకే, అన్నాడీఎంకే తమ కూటములలోని భాగస్వామ్య పార్టీలకు కేటాయించిన సీట్లలో టీవీకే బలమైన ప్రభావం చూపింది.

మాట్రిజ్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా డీఎంకే కూటమికే విజయాన్ని కట్టబెట్టాయి. కూటమికి 122 నుంచి 132 సీట్లు వస్తాయని పేర్కొంది. అన్నా డీఎంకేకు 80 నుంచి 100 సీట్లు రావచ్చని తెలిపింది. టీవీకేకు కనిష్ఠంగా సున్నా, గరిష్ఠంగంఆ 6 సీట్లు లభిస్తాయని పేర్కొంది. పీ–మార్క్‌ సైతం డీఎంకే కూటమికి 125 నుంచి 145 మధ్య సీట్లు లభిస్తాయని తెలిపింది. అన్నాడీఎంకే 60 నుంచి 70 సీట్లు గెలుచుకొనే అవకాశం ఉందని పేర్కొంది. టీవీకేకు ఒకటి నుంచి ఆరు సీట్లు లభిస్తాయని అంచనా వేసింది.

పాండిచ్చేరిలో ఎన్డీయే కూటమి

ఇక్కడ ఎన్డీయే పక్షాలకు 16 నుంచి 19 సీట్లు, డీఎంకే కూటమికి పది నుంచి పన్నెండు సీట్లు లభిస్తాయని పీపుల్స్‌ పల్స్‌ అంచనావేసింది. ఇతరులు ఒకటి లేదా రెండు సీట్లు గెల్చుకోవచ్చని పేర్కొంది. ఓట్ల పరంగా చూస్తే ఎన్డీయేకు 34 నుంచి 36 శాతం, డీఎంకే కూటమికి 30 నుంచి 32 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. టీవీకే, ఎఎంకే కూటమికి 15 నుంచి 17 శాతం ఓట్లు రావచ్చని పేర్కొన్నది.