Man Swallows Spoons, Toothbrushes And Pens | మనిషేనా….స్టీల్ స్పూన్స్..టూత్ బ్రష్ లు తినేశాడు!
ఉత్తరప్రదేశ్ మీరట్‌లో షాకింగ్ ఘటన. కుటుంబంపై కోపంతో బులంద్‌షెహర్‌కు చెందిన వ్యక్తి ఏకంగా 29 స్టీల్ స్పూన్స్, 19 టూత్ బ్రష్‌లు, రెండు పెన్స్ మింగేశాడు. తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు శస్త్రచికిత్స చేసి అన్ని వస్తువులను తొలగించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

విధాత : మనుషులకు సాధ్యం కాని పని అతను చేశాడు. ఏకంగా 29 స్టీల్ స్పూన్స్, 19 టూత్‌బ్రష్‌లు, రెండు పెన్స్‌ని తినేశాడు. అది కూడా తన కుటుంబ సభ్యులపై కోపంతోనట…ఆ తర్వాతే కడుపునొప్పి అంటూ మొత్తుకోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా..స్కానింగ్ చేసిన వైద్యులు కడుపులోని స్టీల్ స్పూన్స్, టూత్ బ్రష్ లు, పెన్నులను చూసి షాక్ అయ్యారు. వామ్మో ఇతను మనిషా..మెషీనా అంటూ అవాక్కయ్యారు. వైద్యరంగంలోనే ఇదో వండర్ అంటూ విస్మయం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ మీరట్‌లోని హపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బులంద్‌షెహర్‌కి చెందిన సచిన్(40) మద్యం, మత్తు పదార్థాలకు అలవాటు పడటంతో విసుగెత్తిపోయిన కుటుంబ సభ్యులు గజియాబాద్‌లోని డీ-అడిక్షన్ సెంటర్ లో చేర్పించారు. అయితే తనను డీ-అడిక్షన్ సెంటర్ లో చేర్పించడం నచ్చని సచిన్ కుటుంబ సభ్యులపై ఆగ్రహంతో సెంటర్‌లో ఉన్న స్పూన్లు, టూత్ బ్రష్‌లను బాత్రూమ్‌కు తీసుకెళ్లి వాటిని ముక్కలుగా చేసి మింగేశాడు. తరువాత తీవ్రమైన కడుపు నొప్పితో అతను పెడబొబ్బలు పెట్టడంతో సిబ్బంది హాపుడ్ ఆస్పత్రికి తరలించారు.
శస్త్ర చికిత్స చేసి బతికించిన వైద్యులు
అక్కడ వైద్యులు సచిన్ కడుపును ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ టెస్టు చేసి ఆశ్చర్యానికి గురయ్యారు. సచిన్ కడుపులో 29స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్‌లు, రెండు పెన్నులు ఉన్నట్లు గుర్తించారు. మొదట ఎండోస్కోపీ ద్వారా తొలగించేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. అనంతరం శస్త్రచికిత్స చేసి అన్ని వస్తువులను కడుపులో నుంచి బయటకు తీశారు. ఈ ఆపరేషన్ విజయవంతమవడంతో ప్రస్తుతం సచిన్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన వైద్యుడు డాక్టర్ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ నా ప్రాక్టీస్‌లో ఇలాంటి కేసు ఇదే మొదటిసారి. స్పూన్లు, బ్రష్‌లు ఇలా మింగడం చాలా ప్రమాదకరం అని తెలిపారు. అదృష్టవశాత్తు అతని సర్జరీ విజయవంతమై ప్రాణాపాయం తప్పిందన్నారు.